రోజు కి 27 పైసలు | 27 paisa for day | Sakshi
Sakshi News home page

రోజు కి 27 పైసలు

Published Wed, Mar 19 2014 4:39 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

రోజు కి 27 పైసలు - Sakshi

రోజు కి 27 పైసలు

ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు... వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనం.. ఇటువంటి మాటలు ఎన్నికల సమయంలోనే ఎక్కువగా వింటాం. ఎన్నికలు ముగియగానే వీటికి నిర్వచనం మారిపోతుంది. అవినీతిరహిత సమాజం నిర్మిద్దామని ప్రతిజ్ఞ పూనేది జనమే.. ఎన్నికలు రాగానే రూ.500, రూ.1000 తీసుకుని ఓట్లు వేసేది మనమే. ఇలా పైసలకు ఆశపడి ఒక్కసారి ఓటు అమ్మితే... అది కొనుక్కొని పదవిలోకి వచ్చిన నాయకులు ఐదేళ్లు అప్పనంగా మేస్తున్నా ప్రశ్నించలేని పరిస్థితి.
 
 ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించాల్సింది పోయి రూ.500, రూ.1000కి కక్కుర్తి పడి అమ్ముకుంటే... అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నాయకులిస్తున్నారు కాబట్టి మేం తీసుకుంటున్నాం.. అనేవారు కొందరైతే... వారు తీసుకోనిదే ఓటు వేయరు కాబట్టి ఇస్తున్నాం అని చెప్పే నాయకులు కొందరు. వారు తీసుకున్నా... వీరు ఇచ్చినా... ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చినవారు ఆ డబ్బులు ఎలా సంపాదిద్దామనే ఆలోచనతోనే ఐదేళ్లు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్న విషయాన్ని గుర్తించాలి.
 
 సోషల్ మీడియాలో హల్‌చల్
 
 ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమెలా? అనే ఆలోచనల్లోనే నాయకులు ఉంటారు. ఓటును బ్రహ్మాస్త్రంగా వినియోగించాల్సిన కొందరు దాన్ని మద్యానికి అమ్ముకుంటే... మరికొందరు మనీకి అమ్ముకుంటున్నారు. ఇంకొం దరు బహుమతులకు కట్టబెడుతున్నారు. ఎన్నికల వేళ మాత్రమే ఓటరు జపం చేసే నాయకుల దగ్గర రూ.500, రూ.వెయ్యి తీసుకుని తమ అమూల్యమైన వజ్రాయుధాన్ని కొందరు అమ్ముకుంటున్నారు. ఓటు కోసం వారు ఇచ్చే రూ.500ను ఓ సారి లెక్కించుకుంటే రోజుకు 27పైసలకు ఓటు అమ్ముకుంటున్నట్లుంది. ఇదే విషయమై ఇటీవల సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ హల్‌చల్ చేస్తోంది. అడుక్కునేవారు కూడా రూపాయి కంటే తక్కువ తీసుకోని ఈ రోజుల్లో కొందరు ఓటును రోజుకు 27 పైసలకు అమ్ముకుంటున్నారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని అందులో ప్రశ్నిస్తూ ఆలోచింపజేస్తున్నారు.
 
 
 పనిచేసే వారికే ఓటేస్తాం
 

రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తారు. అది చేస్తాం, ఇది చేస్తామంటూ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత వారు ఇచ్చిన హామీలను మరచిపోతున్నారు. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విషయాలను పట్టించుకోరు. ఈసారి ఎన్నికల్లో ఇలాంటి వారికి ఓటు వేయం. ప్రజల సమస్యలను పట్టించుకుని పరిష్కరించే వారికే ఓటు వేస్తాం. పనిచేసేవారినే ఎన్నుకుంటాం.
 - తాళ్ల  భరత్, హన్మాన్‌వాడ, భువనగిరిటౌన్
 

 నిజాయితీగా ఓటు వేయాలి
 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు డబ్బులు తీసుకోకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఒక్క సారి అభ్యర్థి ఇచ్చే డబ్బులు తీసుకుంటే ఆయనను మనం ఐదేళ్లు భరించాలి. స్వతహాగా ఓటు వేస్తే గెలిచిన అభ్యర్థిని పనుల విషయంలో కచ్చితంగా అడగవచ్చు. మనం వాళ్లిచ్చే రూ.100, రూ.200లకు ఆశ పడి ఓటు వేస్తే అతడిని ప్రశ్నించలేం. నిజాయితీగా ఓటు వేసి వార్డులో అభివృద్ధి పనులు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు పని చేసే వారికే ఓటు వేస్తే పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఓటు విషయంలో ప్రజలు నిక్కచ్చిగా వ్యవహరించాలి.
 - బొట్టు ఎలిజబెత్, బొట్టుగూడ, నల్లగొండ టౌన్
 
 

ఓటును వజ్రాయుధంగా ఉపయోగించాలి
 

ఓటు వేసేటప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు ఆశించవద్దు.  భవిష్యత్‌లో సామాజిక అభివృద్ధికోసం పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలి. పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓట్లకోసం ప్రలోభాలకు గురిచేస్తారు. పోటీలో ఉన్న వారు ఇచ్చే డబ్బు, మద్యానికి ఓటు వేయకుండా సరైన ప్రతినిధిని ఎన్నుకోవాలి. ఏ పార్టీ మేనిఫెస్టో బాగుందో, వాటిని ఎవరు అమలు చేస్తారో అన్న నమ్మకం కలిగితే ఆ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి. పోటీలో ఉన్న వారు ఇచ్చే * 500లకు అమ్ముడు పోవద్దు. ఆడబ్బు ఇచ్చి ఐదేళ్లపాటు పెత్తనం చేలాయిస్తారు. డబ్బులు ఇచ్చి గెలిచిన వారు అభివృద్ధి చేయరు. అవినీతికి పాల్పడతారు. ఓటును డబ్బులకు అమ్ముకోవద్దు. ఓటుకు అమ్ముడుపోతే మన భవిష్యత్‌ను, 5 సంవత్సరాల కాలం పాటు సామాజికాభివృద్ధిని కోల్పోతాం. రేపటి మన భవిష్యత్‌కు ఓటే వజ్రాయుధం కావాలి.
 - ఎన్, కోటయ్య, అధ్యాపకుడు, మిర్యాలగూడ
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement