సోషల్ మీడియాకూ ‘కోడ్’: ఈసీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రచారానికి కూడా ఎన్నికల కోడ్(ప్రవర్తనా నియమావళి) వర్తిస్తుందని ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు, రాజకీయ పార్టీలకు ఈసీ జారీ చేసిన తాజా ఉత్తర్వులను అనుసరించి.. అభ్యర్థులందరూ తమ ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో రాజకీయ వాణిజ్య ప్రకటనలకు సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది. అంతేగాక సోషల్ మీడియాలో ప్రచారానికి చేసిన వ్యయం వివరాలను కూడా అభ్యర్థులు తమ మొత్తం ఎన్నికల వ్యయంలో చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అక్టోబర్ నాలుగోతేదీ నుంచి అమలులో ఉందని, ఇది ప్రింట్, టీవీ సమాచారానికి సైతం వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అయితే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కాకుండా ఇతరుల ద్వారా పోస్ట్ చేసే అంశాలపై ఏ విధంగా వ్యవహరించాలనే విషయమై కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిత్వశాఖను సంప్రదిస్తున్నట్టు వివరించింది. ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను వినియోగిస్తుండడం, అదే సమయంలో మీడియాలో ఎన్నికల చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈసీ నుంచి ఈ ఉత్తర్వు వెలువడింది. గడిచిన కొన్నేళ్లుగా వెబ్, సోషల్ మీడియా వ్యాప్తి బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇతర మీడియాతోపాటు సోషల్ మీడియాను సైతం నియంత్రించాలన్న డిమాండ్లు రాజకీయ, సామాజిక గ్రూపుల నుంచి వస్తున్నట్టు ఎన్నికల సంఘం ఈ సందర్భంగా పేర్కొంది.