కష్టం మనది కాకపోతే ముంబైదాకా దేక్కుంటూ వెళ్లమని సలహా ఇచ్చాడట వెనుకటికి ఎవరో! అహ్మదాబాద్‌లోని ఓ గుడి నిర్వాహకుల నిర్వాకం ఇదే తీరును తలపిస్తోంది. గుడిలో ఊరేగింపు కోసం వీళ్లు 4 ఏనుగులను తెప్పిస్తున్నారు! ఏనుగు అంబారీపై దేవుడి ఊరేగింపు! బాగానే ఉంది కదా అంటున్నారా? ఎక్కడి నుంచో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు!
దేశానికి తూర్పు కొసన ఉండే అస్సాం నుంచి!!
జూలై 4న అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర జరగనుంది. కానీ.. ఈ గుడికి చెందిన 3 ఏనుగులు వయసు మీదపడటంతో గత ఏడాదే మరణించాయి. ఈ ఏడాదికి అంబారీల్లేకుండానే యాత్ర నిర్వహించినా బాగుండేదది.. కానీ.. గుడి ధర్మకర్తలకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో 4 ఏనుగులను అరువుకు తెచ్చుకుందామని నిర్ణయించారు. ఇంకేముంది అసోంలోని తీన్‌సుఖియా నుంచి గజరాజులను తెప్పించండని ఆర్డర్ వేసేశారు. అసోం ప్రభుత్వమూ అందుకు ఓకే చెప్పింది. ఇంకేముంది.. అంతా హ్యాపీ అనుకుంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు.
రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 3100 కిలోమీటర్లు! ఇంతదూరం ఏనుగులను రవాణా చేయడం ఎలా? ఆ.. ఏముంది. రైల్వే కోచ్‌లపై పంపేస్తే సరి అని అసోం ప్రభుత్వం చెప్పడంతో జంతు ప్రేమికులు మండిపోతున్నారు. కనీసం మూడు నాలుగు రోజుల సమయం పట్టే ఈ ప్రయాణాన్ని గజరాజులు తట్టుకోలేవని.. ఉత్తర భారతమంతా 40 డిగ్రీలకు పైబడ్డ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే.. నోరు లేని జీవాలను ఇంత కష్టపెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వేడికి, వడగాడ్పులకు తట్టుకోలేక మనుషులే చచ్చిపోతూంటే ఏనుగులు ఎలా తట్టుకోగలవు? అని జంతు సంరక్షణ ఉద్యమకారుడు కౌషిక్ బారువా నిలదీస్తున్నారు.
గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్వే కోచ్‌పై రవాణా చేస్తే.. ఏనుగులు ఎంత ఆందోళన, ఒత్తిడికి గురవుతాయో అధికారులు కొంచెం కూడా ఆలోచించకపోవడం అమానవీయమని దుమ్మెత్తి పోస్తున్నారు కౌషిక్! ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏనుగులకు వడదెబ్బ తగలొచ్చునని.. షాక్‌తో మరణించవచ్చు కూడా అని ఆయన హెచ్చరించారు. మన చట్టాల ప్రకారం సంరక్షిత జంతువుగా గుర్తింపబడ్డ ఏనుగులను ఎక్కడికైనా తరలించాలంటే ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆరుగంటల కంటే ఎక్కువ కాలం వాహనాలపై రవాణా చేయకూడదు. ఏకబిగిన ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిపించ కూడదు కూడా. ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ వాటిని తరలించడం ఏమాత్రం సబబు కాదని జంతుశాస్త్రవేత్త బిభూతీ ప్రసాద్ లహకార్ స్పష్టం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీ తరుణ్ గొగోయ్... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఏనుగుల కష్టాన్ని నివారించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు ఓ లేఖ రాశారు. ‘‘అయినా... గణపతిని పూజించే మనవాళ్లు.. ఆ దేవుడికి ప్రతిరూపంగా భావించే ఏనుగును ఒక్క ఊరేగింపు కోసం ఇంత హింసపెట్టాలా?’’ అని కౌషిక్ ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment