ఆస్పత్రిలో మృతుల కుటుంబీకుల రోదనలు
‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఆకాశ్. నల్ల చొక్కా ధరించివున్నాడు. ఇతడిని ఎవరైనా చూశారా?’ అంటూ ఓ వ్యక్తి అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రి కారిడార్‌లో అందరినీ అడుగుతున్నాడు. శవాలను ఉంచే గదిలోకి వెళ్లి చూడాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. ‘ఇప్పటికే నేను మూడు ఆస్పత్రులకు వెళ్లాను. ముందుగా వార్డుల్లో వెతికాను. నేనెందుకు మృతదేహాలను చూడాలి? అతడు చనిపోలేదు’ అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్ నగర శివార్లలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన వారి గురించి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు బతికున్నారో, ఆస్పత్రుల్లో ఉన్నారో తెలియక బాధిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తమ వారి ఆచూకీ కోసం రాత్రంతా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ప్రమాదానికి కారణమైన రైలుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
‘రైల్వే ట్రాక్‌పైకి వెళ్లొద్దని అతడికి చెప్పాను. రైలు పట్టాలపైకి వెళ్లడం ప్రమాదమని చెప్పి వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింద’ని కన్నీళ్ల పర్యంతమయ్యారు 54 ఏళ్ల ముకేశ్ కుమార్. డ్రెస్సింగ్ రూమ్ బయట తన కుమారుడు నీరజ్ (19) మృతదేహం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారాయన. మృతులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రిలోని డ్రెస్సింగ్ రూమ్‌ను మార్చురీగా వినియోగిస్తున్నారంటే పరిస్ధితి ఎంత హృదయ విదాకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘అమృతసర్ రైలు ప్రమాదంతో మరో జలియన్‌వాలా బాగ్ లాంటి మారణోమం జరిగింది. ఈ ఘోర ప్రమాదాన్ని ఎన్నటికీ మర్చిపోలేమ’ని ముకేశ్ కుమార్ ఆవేదన చెందారు.
గురునానక్ దేవ్ ఆస్పత్రిలో సరైన వసతులు లేవన్న విమర్శలు వినవస్తున్నాయి. ‘మృతదేహాలను ఉంచడానికి ఐస్ లేదు. గ్లౌజులు, మాస్కులు లేవు. ఇవన్నీ ఏర్పాటు చేయాలని అధికారులను కోరాం. చెడు వాసన వస్తోందని మృతదేహాలను ముట్టుకునేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. మృతుల సంబంధించిన గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు వెతకాలని మమ్మల్ని డాక్టర్లు అడుగుతున్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నార’ని వలంటీర్లు వాపోయారు. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో 19 మృతదేహాలను కింద పడేశారు. మృతుల్లో 8 మందిని మాత్రమే గుర్తించారు. ‘శరీర భాగాలు తెగిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. ఒక మృతదేహానికి తల కూడా లేదు. ఏడాది పాప, ఆమె తల్లి కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. మా నగరానికి ఈ రైలు రావణుడిలా వచ్చింద’ని రూపక్ అనే వలంటీర్ వెల్లడించారు. ‘గొర్రెలు, మేకలను నరికినట్టుగా మనుషుల శరీరాలను ఈ రైలు ఖండించింది. నా సోదరుడిని ఈ రైలు మింగేసింద’ని అశోక్ కుమార్ అనే యువకుడు భోరున విలపించాడు. అతడి సోదరుడు దీపక్(18) మృతదేహం రెండు భాగాలు విడిపోవడంతో జతచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.
గురునానక్ దేవ్ ఆస్పత్రిలో బాధితుల తరపువారి ఎదురుచూపులు
తన మరిది థాకూర్ ప్రసాద్(40) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారని జానకి అనే మహిళ వెల్లడించారు. ‘రావణ దహనం చూడటానికి ప్రసాద్ ఎప్పుడూ వెళ్లలేదు. మొట్టమొదటిసారి వెళ్లారు. రైలు ప్రమాదం జరిగిందని టీవీలో చూశాక అతడికి ఫోన్ చేశాను. ఓ డాక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రసాద్‌కు సీరియస్‌గా ఉందని చెప్పారు. అతడు చనిపోయాడని తెలుసుకుని ప్రసాద్ భార్య కుప్పకూలిపోయింది. అతడితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయార’ని జానకి తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలతో గురునానక్ దేవ్ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగుతోంది. మరోవైపు క్షతగాత్రులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు భారీ సంఖ్యలో దాతలు తరలి వస్తున్నారు. సరిపడా రక్తం అందుబాటులో ఉందని, అవసరమైతే ఫోన్ చేస్తామని చెప్పి వారికి ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితుల కుటుంబీకులు ఆహార పానీయాలు అందిస్తున్నారు. మరోవైపు తమ శక్తికి మించి పనిచేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు...
అమృత్‌సర్ ప్రమాదం: పాపం దల్బీర్ సింగ్
అమృత్‌సర్ ప్రమాదం: సెల్ఫీల గోలలో పడి
ప్రమాదంలో మా తప్పు లేదు: రైల్వే శాఖ
Comments
Please login to add a commentAdd a comment