సీఎంపై ఈడీ కేసు నమోదు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై మరోసారి చిక్కుల్లోపడ్డారు. తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఈ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోననా సీఎంను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా త్వరలోనే ప్రశ్నించనుంది. అవినీతి నిరోధక శాఖ ఢిల్లీ కేంద్ర కార్యాలయ సహకారంతో రాష్ట్రంలోని సిమ్లాలోని ఈడీ కార్యాలయం కేసును దర్యాప్తు చేస్తుందని ఈడీ వర్గాలు తెలిపాయి.
సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి సుమారు రూ. 6.1 కోట్ల మేర అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఈ క్రమంలో ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరితోపాటు ఎల్ ఐసీ ఏజెంట్ అనంద్ చౌహాన్, అతని సోదరుడు సీఎల్ చౌహాన్ పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది.
కాగా సీబీఐ అధికారులు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆయన ఇళ్లతోపాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో 6 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వీరభద్ర సింగ్ అరెస్టయ్యే అవకాశం ఉందని ఊహాగానాలుకూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా వీరభద్ర సింగ్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఆయన అరెస్ట్ పై స్టే విధించింది.