తీహార్ జైలుకు ఖైదీల కన్నం!
సినీఫక్కీలో ఇద్దరు విచారణ ఖైదీల పరారీ
* మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి...
* పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ
సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో గోడకు కన్నం వేసి తప్పించుకున్నారు.
ఫైజన్(19), జావేద్(18) అనే విచారణ ఖైదీలను రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో 7వ నంబర్ జైల్లోని ‘రోజా’ వార్డులో ఉంచగా శనివారం అర్ధరాత్రి దాటాక వారు 13 అడుగుల పొడవున్న ఆ జైలు గోడను దూకారు. అక్కడి నుంచి మరో 13 అడుగుల గోడను దూకి ఆపై 16 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న గోడకు రాళ్లతో రంధ్రం చేసి అందులోంచి దూరారు. చివరగా మరో 13 అడుగుల గోడ దూకి దానికి సమీపంలోని డ్రైనేజీ వద్దకు చేరుకున్నారు.
అయితే జావేద్‌తో కలసి బయటపడేందుకు ఫైజన్ భయపడగా జావేద్ అతన్ని వదిలేసి డ్రైనేజీలోంచి వెళ్లిపోయాడు. ఫైజన్ అందులో ఇరుక్కుపోవడంతో పోలీసులకు చిక్కాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో వారిద్దరూ కనిపించకపోవడంతో ఈ విషయం బయటపడింది. జావేద్ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఖైదీల పరారీలో జైలు అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. పనిముట్లేవీ లేకుండా ఖైదీలు ఉట్టి చేతులతో కన్నం వేయడం సాధ్యం కాదన్నారు.
ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం జైలు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో కూడా ఆప్ ప్రభుత్వం ఎల్జీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ సొంతంగా విచారణకు ఆదేశించింది.