సాక్షి, న్యూఢిల్లీ : చైనా నుంచి చాక్లెట్లు, పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై విధించిన నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 23 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ నిషేధం గడువును పొడిగించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) పేర్కొంది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్ తయారీలో ఉపయోగించే విషపూరిత మెలామిన్ అనే రసాయనం చైనా నుంచి వచ్చే పాల ఉత్పత్తుల్లో ఉన్నాయనే అభ్యంతరాల నేపథ్యంలో వీటిని నిషేధించిన విషయం తెలిసిందే.
చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోకున్నా, ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, వినిమయదారుగా ఉంది. భారత్‌లో ఏటా 15 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవుతాయి. దేశంలో అత్యధికంగా యూపీలో పాల ఉత్పత్తి సాగుతుండగా, తర్వాతి స్ధానాల్లో రాజస్థాన్, గుజరాత్‌లు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment