ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో చార్జీల తగ్గింపు | Fares on Airport Express Line to be reduced from July 24: DMRC | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో చార్జీల తగ్గింపు

Published Thu, Jul 17 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో చార్జీల తగ్గింపు

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో చార్జీల తగ్గింపు

న్యూఢిల్లీ:ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌లో చార్జీలను తగ్గిం చినట్టు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గురువారం ప్రకటించింది. టారిఫ్‌ను ఈ నెల 24 నుంచి 40 శాతం తగ్గిస్తున్నామని వెల్లడించింది. దీని ప్రకారం కనీస చార్జీని రూ.30 నుంచి రూ.20కి తగ్గిస్తారు. గరిష్ట చార్జీని రూ.180 నుంచి రూ.100కు తగ్గిస్తామని డీఎం ఆర్సీ ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ తెలిపారు. ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ చార్జీలను తగ్గించి, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్‌కు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. మంత్రి సూచన మేరకు ఇక నుంచి 15 నిమిషాలకు బదులు ప్రతి 10 నిమిషాలకు ఒక రైలును నడుపుతుంది.
 
 అంటే రోజుకు 168 ట్రిప్పులు అందుబాటులోకి వస్తాయి. ఇది వరకే వీటి సంఖ్య 148 మాత్రమే. రైళ్ల వేగాన్ని కూడా గంటలకు 70 కిలోమీటర్లకు బదులు 80 కిలోమీటర్లకు పెంచుతారు. ఫలితంగా న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి కేవలం 19 నిమిషాలు పడుతుంది. అంతేగాక ఢిల్లీ ఎయిరోసిటీ నుంచి టెర్మినల్ టి1 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక ఫీడర్ బస్సును అందుబాటులోకి తెస్తారు. ఉదయం ఆరింటి నుంచి రాత్రి 10 గంటల వరకు వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఫెయిర్ స్టోర్ వాల్యూకార్డు కొనుగోలు చేసిన వారికి చార్జీలో 10 రాయితీ ఇస్తారు. చార్జీల తగ్గింపు ద్వారక, దౌలాకువా, న్యూఢిల్లీ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దయాళ్ అన్నారు.
 
 అయితే ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇస్తున్న అన్ని రకాల కార్డులు, రాయితీ పథకాలను రద్దు చేస్తారు. ఆదివారాల్లో కనిష్ట, గరిష్ట చార్జీలుగా రూ.20 నుంచి రూ.60 వరకు మాత్రమే వసూలు చేస్తామని డీఎంఆర్సీ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ చార్జీలపై లోక్‌సభలో గురువారం చర్చ నడిచింది. చార్జీలు తగ్గించాల్సిందిగా డీఎం ఆర్సీకి సూచించామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. టారిఫ్ ఏసీ బస్సు చార్జీలను మించకూడదని చెప్పామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement