ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తలపెట్టిన మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ గ్రహణం పట్టుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తలపెట్టిన మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ గ్రహణం పట్టుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని డీఎం ఆర్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. గుర్తించిన స్థలాలను తమకు తక్షణమే అప్పగించకపోయినట్టయితే మూడో దశ పనులను చేపట్టడం కష్టమవుతుందని ఆ లేఖలో సింగ్ హెచ్చరించారు. భూసేకరణ ఆవశ్యకతను, అది సక్రమంగా జరగకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను ఆయన ఈ నెల 11వ తేదీన రాశారు. ఇందుకు సంబంధించిన ప్రతిని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు కూడా పంపారు.
ముకుంద్‌పూర్, శివ్‌విహార్ ప్రాంతాల్లో భూసేకరణ పెద్ద తలనొప్పిగా పరిణమించిందని పేర్కొన్నారు. దీంతోపాటు ముకుంద్‌పూర్-మాయాపురి. మాయాపురి-లజ్‌పత్‌నగర్ మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొం దన్నారు. దీని పొడవు 84 కిలోమీటర్లని తెలిపారు. ఈ మార్గంలో ఓ చోట మురికివాడ కూడా ఉందని, దీంతో వయాడక్ట్ పనులు ఆగిపోయాయన్నారు. స్థలం దొరకని కారణంగా పంజాబిబాగ్ స్టేషన్ పనలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. ఇక కాళిందీకుంజ్ వద్ద నిర్మించతలపెట్టిన స్టేషన్ విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఢిల్లీ అభివృద్ధి సంస్థకు 2.15 లక్షల చదరపు మీటర్ల స్థలం ఉంది.
ఇక్కడే డిపోను నిర్మించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాల వల్ల ఈ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతోపాటు ఇక్కడే డీడీఏకి మరో లక్ష చదరపు మీటర్ల స్థలం ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ఈ స్థలాన్ని డీడీఏ ఏనాడో డీఎంఆర్‌సీకి అప్పగించింది. అయితే అక్కడే నివాసం ఏర్పరుచుకున్నవారు దానిని ఖాళీ చేసేందుకు ముందుకు రావడం లేదు. లేఖ అందింది: కాగా డీఎంఆర్‌సీ చైర్మన్ మంగూసింగ్ రాసిన లేఖ తమకు అందిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. దీనిని పరిశీలిస్తున్నామన్నారు.