Mangu Singh
-
మంగూ సింగ్‌కు గౌరవ డాక్టరేట్
న్యూఢిల్లీ: దేశంలో మెట్రో టెక్నాలజీలో చేస్తున్న అసాధారణమైన కృషికి, నాయకత్వ ప్రతిభకు గుర్తింపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్‌కు ఓ ప్రైవేట్ యూనివర్సిట్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నోయిడాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఈ గౌరవ పురస్కారాన్ని అందచేసింది. డీఎంఆర్సీ సాధిస్తున్న అపూర్వమైన విజయాలు, అత్యంత వేగంగా అది సాధిస్తున్న పురోగతి వెనుక స్ఫూర్తిదాయకమైన సింగ్ నాయకత్వం ఉందని యూనివర్సిటీ అభినందించింది. సొరంగ మార్గాలను నిర్మించే టన్నెలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ)కి అధ్యక్షునిగా మంగూసింగ్ ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో మెట్రో ప్రాజెక్టు అమలులో ఎనలేని కృషి చేశారని కొనియాడింది. భారీ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో సింగ్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని పేర్కొంది. నిర్దేశిత సమయంలో, కేటాయించిన బడ్జెట్ నిధులతోనే ప్రాజెక్టులను పూర్తి చేశారని తెలిపింది. -
‘మెట్రో’ మూడో దశకు భూసేకరణ గ్రహణం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తలపెట్టిన మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ గ్రహణం పట్టుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని డీఎం ఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. గుర్తించిన స్థలాలను తమకు తక్షణమే అప్పగించకపోయినట్టయితే మూడో దశ పనులను చేపట్టడం కష్టమవుతుందని ఆ లేఖలో సింగ్ హెచ్చరించారు. భూసేకరణ ఆవశ్యకతను, అది సక్రమంగా జరగకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను ఆయన ఈ నెల 11వ తేదీన రాశారు. ఇందుకు సంబంధించిన ప్రతిని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు కూడా పంపారు. ముకుంద్‌పూర్, శివ్‌విహార్ ప్రాంతాల్లో భూసేకరణ పెద్ద తలనొప్పిగా పరిణమించిందని పేర్కొన్నారు. దీంతోపాటు ముకుంద్‌పూర్-మాయాపురి. మాయాపురి-లజ్‌పత్‌నగర్ మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొం దన్నారు. దీని పొడవు 84 కిలోమీటర్లని తెలిపారు. ఈ మార్గంలో ఓ చోట మురికివాడ కూడా ఉందని, దీంతో వయాడక్ట్ పనులు ఆగిపోయాయన్నారు. స్థలం దొరకని కారణంగా పంజాబిబాగ్ స్టేషన్ పనలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. ఇక కాళిందీకుంజ్ వద్ద నిర్మించతలపెట్టిన స్టేషన్ విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఢిల్లీ అభివృద్ధి సంస్థకు 2.15 లక్షల చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇక్కడే డిపోను నిర్మించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాల వల్ల ఈ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతోపాటు ఇక్కడే డీడీఏకి మరో లక్ష చదరపు మీటర్ల స్థలం ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ఈ స్థలాన్ని డీడీఏ ఏనాడో డీఎంఆర్సీకి అప్పగించింది. అయితే అక్కడే నివాసం ఏర్పరుచుకున్నవారు దానిని ఖాళీ చేసేందుకు ముందుకు రావడం లేదు. లేఖ అందింది: కాగా డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ రాసిన లేఖ తమకు అందిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. దీనిని పరిశీలిస్తున్నామన్నారు. -
30 నుంచి ట్రయల్ రన్.
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో మూడో దశ మొదటి పనులు అఖరుకు చేరుకున్నాయి. ఈ నెల 30 నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి మండి హౌస్ మార్గంలో ట్రయల్ రన్లు నిర్వహిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మెట్రో మూడో దశ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 మార్చి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. గతంలో తామనుకున్న 2014 అక్టోబర్ కన్నా ముందుగానే ఈ మెట్రో సేవలను నగరవాసులకు అందుబాటులోకి తెస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 2011 డిసెంబర్లో ప్రారంభమైన మూడో తొలి విడత పనులు త్వరితగతిన పూర్తయ్యాయని చెప్పారు. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ‘ఇంతకుముందు నోయిడా, వైశాలికి వెళ్లే ప్రయాణికులు సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్ వద్ద రెండుసార్లు రైళ్లు మారేవారు. మూడో దశ తొలి మార్గం బాంద్రాపూర్, సెంట్రల్ సెక్రటేరియట్ లైన్ అందుబాటులోకి రావడం వల్ల రైళ్లు మారకుండానే గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలగనుంద’ని ఆయన వివరించారు. మూడో దశ మెట్రోకు మండి హౌస్ స్టేషన్ తొలి ఇంటర్చేంజ్ స్టేషన్‌గా ఉంటుందన్నారు. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్లో కూడా ఇంటర్ చేంజ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలగనుందని, వారి వెతలు తీరనున్నాయని తెలిపారు. రాజీవ్ చౌక్ స్టేషన్‌కు ఉండే ప్రయాణికుల తాకిడి తగ్గుతుందన్నారు.