30 నుంచి ట్రయల్ రన్.
Published Wed, Dec 11 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో మూడో దశ మొదటి పనులు అఖరుకు చేరుకున్నాయి. ఈ నెల 30 నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి మండి హౌస్ మార్గంలో ట్రయల్ రన్‌లు నిర్వహిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మెట్రో మూడో దశ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 మార్చి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. గతంలో తామనుకున్న 2014 అక్టోబర్ కన్నా ముందుగానే ఈ మెట్రో సేవలను నగరవాసులకు అందుబాటులోకి తెస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 2011 డిసెంబర్‌లో ప్రారంభమైన మూడో తొలి విడత పనులు త్వరితగతిన పూర్తయ్యాయని చెప్పారు.
ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ‘ఇంతకుముందు నోయిడా, వైశాలికి వెళ్లే ప్రయాణికులు సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్ వద్ద రెండుసార్లు రైళ్లు మారేవారు. మూడో దశ తొలి మార్గం బాంద్రాపూర్, సెంట్రల్ సెక్రటేరియట్ లైన్ అందుబాటులోకి రావడం వల్ల రైళ్లు మారకుండానే గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలగనుంద’ని ఆయన వివరించారు. మూడో దశ మెట్రోకు మండి హౌస్ స్టేషన్ తొలి ఇంటర్‌చేంజ్ స్టేషన్‌గా ఉంటుందన్నారు. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్‌లో కూడా ఇంటర్ చేంజ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలగనుందని, వారి వెతలు తీరనున్నాయని తెలిపారు. రాజీవ్ చౌక్ స్టేషన్‌కు ఉండే ప్రయాణికుల తాకిడి తగ్గుతుందన్నారు.
Advertisement
Advertisement