న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ ఏడాది జులైలో చార్జీలను దాదాపు 40 శాతం తగ్గించింది. అయినప్పటికీ సంస్థ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. చార్జీలను తగ్గించినప్పటికీ ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఆశించినమేర పెరగలేదు. తొలుత ఈ మార్గంలో మెట్రో రైళ్ల నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ సంస్థ చేపట్టింది. అయితే 2013, జులైలో ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడంతో డీఎంఆర్‌సీ తన భుజస్కంధాలపైకి ఎత్తుకుంది. అప్పట్లో ప్రతిరోజూ దాదాపు 10,069 మంది రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాతి సంవత్సరం అది 17,943కు చేరుకుంది. ఆ తర్వాత రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంతోపాటు చార్జీలను కూడా తగ్గించింది. అంతేకాకుండా మెట్రో రైలు సేవలను ప్రారంభ సమయాన్ని గం. 4.45గా చేసింది.
అంతకుముందు గం. 5.15 నిమిషాలకు తొలి రైలు బయల్దేరేది. అంతకుముందు ఈ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక మెట్రో రైలు వచ్చేది. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంద్వారా ఇప్పుడు ఆ సమయాన్ని పది నిమిషాల 30 సెకండ్లకు కుదించారు. ఇందువల్ల ఈ మార్గంలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతకుముందు 148 ట్రిప్పులు ఉండగా ఆ తర్వాత వీటి సంఖ్య 166కు చేరుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు వసతులు కూడా బాగా పెంచారు. శివాజీ మెట్రో స్టేషన్ వద్ద ఫీడర్ సేవలను పెంచారు. ఆయా స్టేషన్లవద్ద దిగిన ప్రయాణికులకు తక్షణమే బస్సులు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇంతచేసినప్పటికీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రయాణికుల సంఖ్య అంతంతగానే పెరిగింది.
ఈ విషయం డీఎంఆర్‌సీని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ మార్గంలో మొత్తం 21 స్టేషన్లు ఉన్నాయి. కాగా ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పొడగించే అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) దృష్టి సారించింది. గుర్గావ్ వరకూ పొడిగించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా హర్యానా ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ గుర్గావ్ వరకూ ఈ మార్గాన్ని పొడిగించినట్టయితే మెట్రో రైలు సేవలను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇందువల్ల వారు తమ తమ గమ్యస్థానాలకు సత్వరమే చేరుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.
చార్జీలు తగ్గించినా స్పందన అంతంతే
Published Mon, Dec 29 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement