ఆస్తిహక్కుపై సుప్రీం సంచలన తీర్పు
పెళ్లయిన మహిళలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కట్టుకున్న భార్యకు, ఏకైక కొడుక్కి ఏమీ ఇవ్వకుండా.. పెళ్లయిన కుమార్తెకు మొత్తం ఆస్తిని ఇచ్చేయొచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పశ్చిమబెంగాల్ సహకార సంఘాల నిబంధనల ప్రకారం సొసైటీలోని ఒక ఫ్లాట్ ఓనర్ తన తర్వాత ఆ ఇంటిని కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వొచ్చని ఉంది. ఈ నిబంధనను చూపిస్తూ, తన భర్త కొనుగోలు చేసిన ఫ్లాట్ యాజమాన్యాన్ని మేనేజింగ్ కమిటీవాళ్లు తమ పెళ్లయిన కుమార్తె ఇంద్రాణికి ఇవ్వడాన్ని సవాలుచేస్తూ విశ్వరంజన్ సేన్‌గుప్తా భార్య, కుమారుడు హైకోర్టుకెక్కారు. తన భార్య, కొడుకు తనను సరిగ్గా చూడకపోవడంతో చివరి రోజుల్లో సేన్‌గుప్తా తన కుమార్తె వద్దే ఉండేవారు. ఈ కేసులో ఇంద్రాణి అప్పీలు చేయగా, ఆ ఫ్లాట్‌ను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆమె తల్లి డివిజన్ బెంచికి అప్పీలు చేశారు. మొత్తం ఆస్తిలో ఇంద్రాణి కూడా ఒక భాగస్వామి అవుతారు తప్ప మొత్తం ఆస్తికి ఏకైక హక్కుదారు కాదని డివిజన్ బెంచి తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలుచేస్తూ ఇంద్రాణి సుప్రీంను ఆశ్రయించారు.
ఈ మొత్తం అంశాన్ని పరిశీలించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. సహకార సంఘంలో సభ్యుడు తనకు కావల్సినవాళ్లను నామినేట్ చేసుకోవచ్చని, ఆ సభ్యుడు మరణించిన తర్వాత సొసైటీ తప్పనిసరిగా సదరు నామినీ ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.