పెళ్లిళ్లు చేయలేనని.. ముగ్గురు కూతుళ్ల హత్య!
ఇంటివద్ద చక్కగా చదువుకుంటున్న తన కూతుళ్లకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి.. వాళ్ల ప్రాణాలు నిలువునా తీసేశాడో కసాయి తండ్రి. పిల్లలను షాపింగ్కు తీసుకెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి మంచి భోజనం వండాలని భార్యకు చెప్పాడు. ఈ మాటలు విన్న పిల్లలు ఎగిరి గంతేసి నాన్న చంకన ఎక్కేశారు. తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదమైన ఈ ఘటన గుజరాత్లో పాండిసిరా అనే గ్రామంలో చోటుచేసుకుంది.
తనకు ముగ్గురూ కూతుళ్లే ఉండటం, వాళ్లు పెద్దయితే పెళ్లిళ్లు చేయలేననే ఆలోచనతో అజయ్ దూబే (33) అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలు ప్రియ (7), అంకిత(9), భావన(2)లను గొంతు నులిమి చంపేశాడు. ముగ్గురి మృతదేహాలు కాలువలో పడేశాడు. కూతుళ్లు, భర్త రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన అజయ్ భార్య మీరాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కాలువలో మృతదేహాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విచారించగా, అక్కడే ఉన్న అజయ్ తన పిల్లలను తానే చంపేసినట్లు చెప్పాడు. ఇటీవల వ్యాపారంలో మూడు లక్షల నష్టం వచ్చిందని, వారిని పెంచి పెళ్లి చేయలేనేమోననే భయంతో హతమార్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఒకవైపు గుజరాత్ నుంచే వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పఢావో అనే నినాదం ఇచ్చినా, అదే రాష్ట్రంలో ఇలాంటి ఘోరం జరగడం దారుణం.