నాన్న కాదు కిరాతకుడు..
గోపవరం/వైఎస్సార్ కడప: నాన్న అంటే నమ్మకానికి ప్రతీక అంటారు..కానీ ఆ కసాయి తండ్రి ఇందుకు అర్హుడు కాడు.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా నాన్నే సర్వస్వమని నమ్మారు ఆ ఇద్దరు చిన్నారులు. నాన్నలోనే అమ్మను చూసుకున్నారు. కానీ ఉన్నట్టుండి నాన్న రాక్షస అవతారం ఎత్తుతాడని ఆ చిన్నారులకేం తెలుసు..అంగడికి రండి అంటే ఆనందంగా బైక్ ఎక్కేశారు. ఏం కొంటాడో అని ఆశ పడ్డారు. కానీ ఆ తండ్రి కన్న బిడ్డలని కూడా చూడకుండా నిర్దయగా..అమానవీయంగా బావిలోకి తోసి పరారయ్యాడు. గోపవరం మండలం శ్రీనివాసాపురంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి శుక్రవారం పెద్దకుమార్తె శవం బయటపడింది. రెండో బిడ్డ ప్రాణాలతో ఉందేమో అని భావించిన కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లుతూ శనివారం శవమై కనిపించింది. ఈ ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్ల బాలకొండయ్య, బుజ్జమ్మలకు భావన (11), శోభన (9) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక బుజ్జమ్మ 5 సంవత్సరాల క్రితమే ఉరి వేసుకుని చనిపోయింది.
భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకునేందుకు బాలకొండయ్య తన తల్లిదండ్రులను ఇంటిలో ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు మేనత్త కూడా పిల్లల బాగోగులు చూసేది. స్థానిక పాఠశాలలో పెద్ద కుమార్తె భావన 5వ తరగతి, రెండవ కుమార్తె శోభన 3వ తరగతి చదువుతున్నారు. పిల్లలిద్దరిని తండ్రి బాగానే చూసుకుంటుండేవాడని స్థానికులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. మరో మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని కూడా బాడుగల కోసం తిప్పుకుంటున్నాడు.
అంగడికి వెళ్దామని చెప్పి..
గురువారం పిల్లలిద్దరూ బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6–45 గంటల సమయంలో అంగడికి వెళ్దామంటూ బైకుపై ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లాడు. తర్వాత వారెవరూ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గాలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న బావిలో పెద్ద కుమార్తె భావన శవమై ఉండటాన్ని గుర్తించారు. వారు హుటాహుటిన గ్రామంలోకి వెళ్లి సమాచారం చేరవేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది, పోలీసులతో పాటు స్థానికులు బావి వద్దకు చేరుకుని భావన శవాన్ని బయటకు తీశారు.
ఇద్దరు పిల్లలతో పాటు తండ్రి కూడా బావిలో దూకి చనిపోయి ఉంటారని అందరూ అనుమానించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు వారి కోసం మరింత గాలించగా... గోనె సంచిలో కుక్కి ఉన్న చిన్న కుమార్తె శోభన మృతదేహం శనివారం ఉదయం బావిలో బయటపడింది. తండ్రి బాలకొండయ్య ఆచూకీ దొరకలేదు. కాగా, బాలకొండయ్య నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఉన్నట్లు అక్కడి బంధువొకరు సమాచారమిచ్చారు. పోరుమామిళ్ల నుంచి టేకూరుపేట మీదుగా బాలకొండయ్య బైకులో వెళుతున్నట్లు సీసీపుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో.. గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు
ఇరువురు అక్కా చెల్లెళ్ల మృతదేహాలను శనివారం ఉదయం ఒకేసారి స్మశానానికి తీసుకెళుతున్నప్పుడు నానమ్మ, జేజబ్బ, కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. వృద్ధుల రోదనను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శోభన తలకు బలమైన గాయం ఉంది. గొంతును బలంగా నులిమినట్లు పోస్టుమార్టం ద్వారా వైద్యులు గుర్తించారు. ముందుగా భావనను బావిలో వేసిన తర్వాత శోభన కేకలు వేయడం వల్లే తలపై గాయపరిచి గొంతు నులిమి బావిలో వేసినట్లు భావిస్తున్నారు. శోభన బావిలో వేసేముందే మృతిచెందింది. అందువల్లే బావిలోని పూడికలో ఇరుక్కుపోయి ఉంటుందని చర్చించుకుంటున్నారు. నిందితుడి కోసం బద్వేలు రూరల్ సీఐ చలపతి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బాలకొండయ్యను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఆదివారం వెల్లడించే అవకాశం ఉంది.