యూపీ అసెంబ్లీలో రచ్చ!
- గవర్నర్‌పై కాగితపు బంతులు విసిరిన ప్రతిపక్ష నేతలు
- తొలిసారి డీడీలో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత సోమవారం తొలిసారి సమావేశమైన శాసన సభలో ప్రతిపక్ష పార్టీలు రచ్చరచ్చ చేశాయి. సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ రామ్‌నా యక్‌పై ఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు కాగితపు బంతులు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలతో హోరెత్తించారు. ఈలలేసి గోల చేశారు. దూసుకువస్తున్న కాగితపు బంతుల నుంచి గవర్నర్‌ను రక్షించేందుకు మార్షల్స్... పుస్తకాలు, ఫైళ్లను అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు. కాగా, యూపీలో అసెంబ్లీ సమావేశాలను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. యూపీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే... ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా పెద్దపెట్టున నిరసనలు తెలిపారు.
ఎస్పీ శాసనసభాపక్ష నాయకుడు రాజేష్‌యాదవ్... తనకు ప్రసం గం వినిపించడం లేదంటూ పెద్దగా ఈల వేసి చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి చొచ్చుకు పోయారు. 84 పేజీల ప్రసంగాన్ని తీవ్ర గందరగోళం మధ్య గవర్నర్ రామ్‌నాయక్ 35 నిమిషాల్లో పూర్తి చేశారు. ఒకప్పుడు యూపీ అన్నింటా ముందుండేదని, కానీ.. గత కొన్నేళ్లుగా వెనుకబడిందని గవర్నర్ చెప్పారు. మళ్లీ ఇన్నాల్టికి యోగి ఆధ్వర్యంలో అగ్ర భాగాన దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఈ గందరగోళం సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలోనే ఉన్నారు.