ముంబై: దోపిడీ కేసులో అరెస్టయిన యువకుడి కస్టడీ మృతిపై బాంబే హైకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఇందుకు పోలీసులే బాధ్యులని నిరూపించడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిది మంది పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే కేసుల్లో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని న్యాయమూర్తులు వీఎం కనడే, పీడీ కోడే డీజీపీని ఆదేశించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 18న పోలీసు కస్టడీలో మరణించిన 24 ఏళ్ల ఆగ్నెలో వల్డారిస్ పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అతని వైద్యనివేదికలు, ఆస్పత్రి రిజిస్టర్‌ను కుటుంబ సభ్యులకు అందజేయాలని స్పష్టం చేశారు. వల్డారిస్ తండ్రి జేవియర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు పైఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో జేవియర్ కూడా అరెస్టయ్యాడు.
తనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు లైంగికంగా వేధించారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. బాగా కొట్టడం వల్లే తన కొడుకు మరణించాడని స్పష్టీకరించారు. తమ కస్టడీ నుంచి తప్పించుకోబోయే ప్రయత్నంలో వల్డారిస్ రైలు కింద పడి మరణించాడని వడాలా పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు. జేవియర్ న్యాయవాది స్పందిస్తూ ఈ వాదన అబద్ధమని, ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదాపడింది.
తొమ్మిది మంది పోలీసులపై ఎఫ్‌ఐఆర్
Published Tue, Jun 10 2014 10:33 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement