
లక్నో : విద్యుత్ చోరీ ఆరోపణలపై ఎస్పీ నేత, ఎంపీ ఆజం ఖాన్ భార్యపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాంపూర్‌లో ఆజం ఖాన్ భార్య పేరిట ఉన్న రిసార్ట్‌పై దాడులు చేపట్టిన అధికారులు వారి విద్యుత్ మీటర్‌కు నిర్ధేశించిన విద్యుత్ కంటే అధికంగా అక్రమ పద్ధతుల్లో విద్యుత్‌ను వాడుకుంటున్నట్టు గుర్తించారు. ఈ రిసార్ట్ ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమా పేరిట ఉందని అధికారులు వెల్లడించారు. 5 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ మీటర్ ఉండగా వారు అక్రమ పరికరాలను బిగించి వారి విద్యుత్ మీటర్లలో రీడింగ్స్ నమోదు కాకుండా సామర్ధ్యానికి మించిన విద్యుత్‌ను అనధికారికంగా వాడినట్టు గుర్తించామని చెప్పారు. అధికారుల ఫిర్యాదుతో రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా ఆజం ఖాన్ గతంలో ములాయం, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment