మాస్కో/ముంబై: రష్యా సముద్ర జలాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్ ఓడల్లో పేలుడు, మంటల కారణంగా 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ ఓడల్లో భారత్, టర్కీ దేశాల సిబ్బంది ఉన్నారు. అయితే, భారతీయ సిబ్బందిలో చాలా మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్(డీజీఎస్) స్పష్టం చేసింది. అజోవ్, నల్ల సముద్రాలను కలిపే కెర్చ్ జలసంధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన క్యాండీ అనే ఓడలో ఉన్న ధ్రువీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ)ను మేస్త్రో అనే ట్యాంకర్ ఓడలోకి సిబ్బంది నింపుతున్నారు.
ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించడంతో చెలరేగిన మంటలు రెండు ఓడల్లోనూ శరవేగంగా వ్యాపించాయి. దీంతో సిబ్బంది భయంతో సముద్రంలోకి దూకేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారన్న రష్యా ప్రభుత్వం వారి వివరాలను వెల్లడించలేదు. తమ నేవీ సిబ్బంది 12 మందిని రక్షించారని, మరో ఆరుగురి జాడ తెలియడం లేదని తెలిపింది. ప్రమాదం జరిగిన క్యాండీ ఓడలోని 17 మంది సిబ్బందిలో భారతీయులు 8 మంది కాగా టర్కీ జాతీయులు 9 మంది ఉన్నారు. మేస్త్రోలోని 15 మందిలో ఏడుగురు చొప్పున భారత్, టర్కీ దేశస్తులు, ఒకరు లిబియా దేశస్తుడని సమాచారం. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment