ఐఫోన్లు మార్చి.. చైనా ఫోన్లు పెట్టేశాడు!
ఆన్లైన్లో మీరు ఏమైనా ఖరీదైన వస్తువులు బుక్ చేసుకున్నారా? కానీ అసలు వస్తువుకు బదులు నకిలీలు వస్తున్నాయా.. అయితే ఖంగారు పడకండి. డెలివరీ చేసే బోయ్లు ఈ తరహా మోసాలకు పాల్పడే అవకాశం చాలా ఉంది. సరిగ్గా ఇలాగే చేసిన ఫ్లిప్కార్ట్ డెలివరీ బోయ్ మోసాన్ని పోలీసులు పసిగట్టారు. ఐఫోన్లు బుక్ చేసుకున్నప్పుడు.. అసలు వాటికి బదులు నకిలీలు అంటగట్టడం అతగాడికి వెన్నతో పెట్టిన విద్య అట. నాలుగు నెలల క్రితం చెన్నైలో ఉద్యోగానికి చేరిన నవీన్ (21) తాను డెలివరీ చేయాల్సిన ప్రాంతంలో ఎవరైనా ఐఫోన్లు ఆర్డర్ చేస్తే, వాటిలోని అసలు ఫోన్లను తాను తీసేసుకుని.. వాటికి బదులు నకిలీ ఫోన్లను కస్టమర్లకు అంటగట్టేవాడు. తర్వాత.. కస్టమర్కు అది నచ్చలేదంటూ వాటిని రిటర్న్ ఇచ్చేసేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 ఫోన్లను అతడు మార్చేశాడు.
మొదటిసారి తనను ఎవరూ పట్టుకోలేకపవడంతో.. ఈ స్కామును నెలరోజుల పాటు కొనసాగించాడు. ఎట్టకేలకు ఒకే ప్రాంతం నుంచి ఇలా ఐఫోన్లు తిరిగి వస్తున్న విషయాన్ని ఫ్లిప్కార్ట్ కంపెనీ గమనించింది. వెట్రిసెల్వం అనే గోడౌన్ యజమాని నవీన్ మీద ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతడు ముందుగా ఒక నకిలీ చిరునామాతో ఫోన్ ఆర్డర్ చేసి, దాన్ని చైనా ఫోన్తో మార్చేశాడని.. కస్టమర్కు నచ్చలేదంటూ దాన్ని తిరిగి గోడౌన్కు తెచ్చాడని వెట్రిసెల్వం చెప్పారు. బీకాం చదివిన నవీన్.. తన అప్పులు తీర్చుకోలేక ఇలా చేసినట్లు చెబుతున్నారు. కాలేజి రోజుల్లో విలాసవంతమైన జీవితం గడపడం కోసం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.