
గడ్డి స్కాంతో 44 కోట్ల ఆస్తులు, 18 ఫ్లాట్లు!
ఒక వ్యక్తికి 18 ఫ్లాట్లు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఉన్నాయి. అంతే కాదు.. అతడి మొత్తం ఆస్తి దాదాపు 44 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎప్పుడో 1996లో బీహార్లో జరిగిన గడ్డిస్కాంలో సంపాదించినవే. వీటిని ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయపన్ను శాఖ వేలం వేయబోతోంది. త్రిపురారి మోహన్ ప్రసాద్ అనే వ్యక్తి అప్పట్లో బీహార్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు గడ్డి సరఫరా చేసేవారు. ఆయనకు మొత్తం 18 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012 నుంచి మోహన్ ప్రసాద్ జైల్లో ఉన్నారు. అతడి ఫ్లాట్లన్నీ దానాపూర్ ప్రాంతంలోని ఒకే అపార్టుమెంట్లో ఉన్నాయి. అవి ఒక్కోటీ రూ. 37 నుంచి 47 లక్షల వరకు విలువ చేస్తాయి.
వీటిని వేలం వేస్తున్న విషయం తెలిసి చాలామందికి ఆసక్తి కలిగిందని, గత కొన్ని రోజులుగా వీటిని వచ్చి చూస్తున్నారని ఆ అపార్టుమెంట్లో ఉండేవాళ్లు చెబుతున్నారు. వేలాన్ని ఆపడానికి మోహన్ ప్రసాద్, ఆయన బంధువులు కోర్టులో కేసులు వేసినా.. పాట్నా హైకోర్టు మాత్రం వాళ్ల పిటిషన్ను తిరస్కరించింది.