మరో ఛాయ్వాలాకు కీలక పదవి | For BJP's Uttar Pradesh Mission, A New Leader - Once A Tea Seller | Sakshi
Sakshi News home page

మరో ఛాయ్వాలాకు కీలక పదవి

Published Fri, Apr 8 2016 7:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మరో ఛాయ్వాలాకు కీలక పదవి - Sakshi

మరో ఛాయ్వాలాకు కీలక పదవి

లక్నో: నరేంద్ర మోదీ.. ఛాయ్వాలా నుంచి దేశ ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు. చిన్నతనంలో తండ్రికి చేదోడుగా ఛాయ్ అమ్మిన విషయాన్ని మోదీ పలు బహిరంగ వేదికల్లో ఎన్నోమార్లు చెప్పారు. గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఇవి చాలామందికి తెలిసిన సంగతులే. కొత్త విషయం ఏంటంటే.. ఒకప్పటి మరో ఛాయ్వాలాకు కీలక పదవి దక్కింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు బీజేపీ చీఫ్గా నియమితులయ్యారు. ఆయనే కేశవ్ మౌర్య (47). లక్ష్మీకాంత్ బాజ్పేయి స్థానంలో ఆయన్ను పదవిలో నియమించారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మౌర్య సారథ్యంలో బీజేపీ  బరిలో దిగనుంది. ఈ ఎన్నికలు బీజేపీకి, మౌర్యకు కీలకమైనవి.

మోదీ లాగే మౌర్య కూడా చిన్నతనంలో తండ్రి టీ స్టాల్లో టీ అమ్మేవారు. విశ్వ హిందూ పరిషత్లో నాలుగేళ్లు పూర్తి స్థాయి ప్రచారక్గా పనిచేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్సభ నియోజకవర్గంలోనూ పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం పూల్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెనుకబడిన వర్గాల చెందిన మౌర్యను బీజేపీ వ్యూహాత్మకంగా యూపీ పార్టీ చీఫ్గా నియమించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు మౌర్యకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నియామకం వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దల పాత్ర ఉన్నట్టు సమాచారం.

80 లోక్సభ నియోజకవర్గాలున్న యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 72 సీట్లు సాధించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. పార్టీకి అండగా ఉంటున్న బ్రాహ్మణ, అగ్రవర్ణాల ఓట్లతో పాటు వెనుకబడిన, దళితుల ఓట్లను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా వెనుకబడిన కియోరి కులానికి చెందిన మౌర్యను యూపీ బీజేపీ చీఫ్గా నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement