
రైతులతో నేడు రాహుల్ భేటీ
భూసేకరణ సవరణ బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల సెలవు తర్వాత తిరిగొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారమిక్కడ రైతుల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ సవరణ బిల్లుపై వారితో విస్తృత చర్చలు జరపనున్నారు. రాహుల్‌ను కలుసుకోబోయే వారిలో 2011లో ఆయన పాదయాత్ర ప్రారంభించిన భట్టా పర్సాల్ గ్రామస్తులు కూడా ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో పార్టీ నిర్వహించనున్న రైతుల సభకు రాహుల్ నేతృత్వం వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.
సెలవుల తర్వాత రాహుల్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సభకు సంబంధించి ఇప్పటికే ‘చలో ఢిల్లీ చలో’ నినాదాలతో ఎఫ్‌ఎం రేడియోల్లో ప్రచార హోరును సాగిస్తున్నారు. సభలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ప్రసంగిస్తారు. కాగా సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక శుక్రవారం రాహుల్ ఇంటికెళ్లి రెండు గంటల పాటు గడిపారు. పార్టీలో కొత్తతరం బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంకేతాలిచ్చారు.