
రక్షణ రంగానికి రూ.27లక్షలకోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లకు గాను భారత రక్షణ రంగం, ప్రభుత్వాన్ని భారీ మొత్తంలో నిధులు కోరింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును ఎదుర్కొవడానికి, అవసరమైన ఆయుధాల ఆధునీకరణ, కొనుగోలుకు ఏకీకృత రక్షణపథకం కింద 2017-2022 నాటికి రూ. 26.84 లక్షల కోట్ల రూపాయల (416 బిలియన్ డాలర్లు) కేటాయింపును కోరింది. ఇందులో భాగంగా డీఆర్డీవోతో సహా వివిధ రంగాలకు చెందిన అధిపతులు జులై 10-11 న జరిగిన యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో 13 వ పంచవర్ష ప్రణాళిక సంఘానికి నివేదిక సమర్పించారు. ప్రణాళిక సంఘం ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.
సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ సమీపంలో భారత్, చైనా బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నియంత్రణ రేఖల వెంట పాక్ జరుపుతున్న రోజువారి కాల్పులకు చెక్ పెట్టాలనే ఉద్ధేశంతో రక్షణాత్మకమైన ఖర్చులు కోసం ఈ అంచనాలు రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భద్రతా దళాల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యత ఉంటుందని సైనిక దళాలకు హామీ ఇచ్చారు. 2017-18 రక్షణ బడ్జెట్లో, రూ. 1,72,774 కోట్ల రెవెన్యూ వ్యయం ఉండగా అందులో, రూ. 86,488 కోట్లు కొత్త ఆయుధ వ్యవస్థలకు, ఆధునీకరణకు ఖర్చుచేసినట్లు మంత్రి తెలిపారు.
అంతేకాకుండా, రూ. 2.74 లక్షల కోట్లతో వేసిన రక్షణ బడ్జెట్, దేశ జీడీపీలో కేవలం 1.56 శాతం మాత్రమేనని, ఇది 1962లో చైనాతో జరిగిన యుద్ధ ఖర్చు కంటే అతి తక్కువ అని అన్నారు . భద్రతా బలగాలు రక్షణ బడ్జెట్ వారి కార్యాచరణ అవసరాల కోసం 2% వరకు పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 13 వ రక్షణ ప్రణాళిక ప్రకారం, భద్రతా బలగాల కోసం రూ.12,88,654 కోట్ల వ్యయం అంచనా వేయగా, రూ .13,95,271 కోట్లు ఖర్చుచేసింది. సాయుధ దళాల పరిస్థితి పూర్తిగా మెరుగుపరచడంతో పాటు ప్రతి సంవత్సరం పూర్తి స్థాయిలో నిధులు, పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత పదిహేనేళ్లగా భద్రత బలగాలు దీర్ఘకాలిక ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ ప్రణాళికలు వేస్తున్నా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి ఆమోదం లభించడం లేదు.