సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులపై విదేశాంగ శాఖ స్పందించింది. భారత వైమానిక దాడులలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సైనికులు వీర మరణం పొందారు. మసూద్ అజహార్‌కు చెందిన జైష్ ఏ మహ్మద్ దీనికి మూలకారణం. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద సంస్థలు దాడులు చేయలేవు. రెండు దశాబ్ధాలుగా పాకిస్తాన్‌లో జైషే మహ్మద్ స్థావరాలు ఉన్నాయి.
వేలమంది జిహాదీలకు శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఆపివేయాలని పాకిస్తాన్‌ను అనేకసార్లు కోరాం. వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని సూచించాం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత నివారణకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2001లో డిసెంబర్‌లో పార్లమెంట్‌పై కూడా దాడి చేశారు. పాక్‌లో ఉగ్రవాద శిబిరాలను గుర్తించారు. పఠాన్ కోట్, యురీ, పుల్వామా దాడులకు సంబంధించి ఆధారాలు ఇచ్చాం. పుల్వామా ఉగ్రవాది ఘటన జరిగిన తర్వాత రోజు దాడులకు సిద్ధమయ్యాం. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్)
మరిన్న దాడులకు పాక్ కుట్ర
మరో భారీ దాడికి ఉగ్రవాద సంస్థలు సిద్ధమవుతున్నారన్న సమాచారం వచ్చింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇవాళ ఉదయం ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేశాం. బాలాకోట్‌లో చేసిన దాడిలో పెద్ద ఎత్తున జిహాదీలు, కమాండర్లు హతమయ్యారు. పౌర సముదాయాలకు దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జైషే ఉగ్రవాదుల శిబిరాలపై చేశాం. మసూద్ అజహార్ మేనల్లుడు యుసుఫ్ అజహార్ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. ఇప్పటికైనా పాకిస్తాన్ తన భూభాగంలో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తుందని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment