కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలేశ్వర్ రామ్ (87) కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన పాట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి పరమపదించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమస్తిపూర్ జిల్లా సమర్థా గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించిన ఆయన బీఏ వరకు చదివారు.
1952- 70 మధ్యకాలంలో బీహార్లోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన.. పదేళ్లపాటు మంత్రిగానూ పనిచేశారు. 1980లో సోరేసా లోక్సభ స్థానంలో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అనంతరం ఇందిరాగాంధీ క్యాబినెట్లో చోటుదక్కించుకుని కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. బాలేశ్వర్ రామ్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ చౌదరి సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.'రామ్ మరణం బీహార్కు తీరని లోటు' అని సంతాప సందేశంలో సీఎం నితీశ్ పేర్కొన్నారు.