
శకలాలు దొరికాయి
ఇటానగర్: భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ శకలాన్ని బుధవారం అరుణాచల్‌ప్రదేశ్ సమీపంలో అధికారులు గుర్తించారు. మంగళవారం హెలికాప్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారా.. లేదా అన్న విషయం తెలియడం లేదని రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని పపుమ్‌పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభించిన కొద్ది సమయానికే రాడార్‌తో సంబంధాలు కోల్పోయినట్లు రక్షణశాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సంబిత్‌ఘోష్ తెలిపారు. సగలీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన అడ్వాన్సెడ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) మంగళవారం సగలీ బయలుదేరింది. ఆ సమయంలోనే హెలికాప్టర్ అదృశ్యమైంది.