న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని బీ బ్లాక్‌లో చిన్న విషయమై జరిగిన ఘర్షణకు సంబంధించిన 33 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్న విషయమై రెండు వర్గాల మధ్య శుక్రవారం జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో 4గురికి తుపాకీ గాయాలు, మరో 13 మంది పోలీసులకూ గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన 10 మంది నిందితులను శుక్రవారం మరో 23 మందిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి..దీపావళి పండుగ రోజు తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని బీ బ్లాక్‌లో రెండు వర్గాలు చిన్న విషయమై ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొన్నారు. రెండు వైపులా కొందరికి గాయాలయ్యాయి.
ఘర్షణను అదుపులోకి తేవడానికి రంగంలోకి దిగిన పోలీసుల్లో 13 మందికి రాళ్లదెబ్బలు తగిలాయి. ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులల్లో క్షతగ్రాత్రులు చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ రిజర్వు దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు రంగంలోకి దిగాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి ఉండడంతో 30 పోలీస్ వ్యాన్ లు, వాటర్ క్యానన్‌లతో అక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పండుగల సందర్భంగా మతకలహాలు చోటు చేసుకోవచ్చని అన్ని రాష్ట్రాలను ఐబీ అప్రమత్తం చేసింది. నగరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనలో ‘నల్గురు వ్యక్తులకు తుపాకీ గాయాలయ్యాయి. కానీ పోలీసుల తుపాకుల వల్ల మాత్రం కాదు. తుపాకీలు పేలుళ్ల వెనుక ఉన్నదెవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి పేర్కొన్నారు.
పరిస్థితి అదుపులో ఉంది
నగరంలోని ట్రిలోక్‌పురిలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులకు వెనుకాడేదిలేదని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో పోలీసులతోపాటు ఇంటెలీజెన్సీ విభాగం, ఇతర ఏజెన్సీలు పరిస్థితిని పరిశీలిస్తున్నాయని అన్నారు. పండుగల సందర్భంగా మతకలాహాలు జరుగుతాయనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
త్రిలోక్‌పురి ఘటనలో 33 మంది అరెస్టు
Published Sat, Oct 25 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement