ఇటీవల మతఘర్షణలు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో శాంతిభద్రతల పేరుతో పోలీసులు చేస్తున్న హడావుడి అంతా ఇంతకాదు. చేతికి దొరికిన అమాయకులను అరెస్టు చేసి జైలు పాల్జేస్తున్నారు. ఒకవైపు తొలగిపోని ఉద్రిక్తత కారణగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పోతున్న వైనం. మరోవైపు స్థానికంగా ఉన్న కొందరిని అల్లర్లతో సంబంధం ఉన్నదనే సాకుతో పోలీసుల అరెస్టులు.. వెరసి అమాయక ప్రజలు విలవిల్లాడుతున్నారు.
న్యూఢిల్లీ: ‘ఆ ఇంట్లో చీకట్లు అలుముకొన్నాయి..తనకొడుకుని కలుసుకోనీయడం లేదు. ఘర్షణలో నీ కొడుక్కు సంబంధం ఉన్నదని దబాయిస్తున్నారు? ఇదెక్కడి న్యాయం? ఈ ప్రాంతంలో 1984లో సిక్కుల ఊచకోత ఘటన తర్వాత మళ్లీ ఇలాంటి దుర్మార్గాన్ని చూడలేదు. తన కొడుకును అకారణంగా పోలీసులు పట్టుకెళ్లారు. ఘర్షణ జరిగిన రోజు కూడా ఇంటి వద్ద లేడు. మీరట్‌కు వెళ్లి తిరిగొచ్చాడు.
అదే సమయంలో వచ్చిన పోలీసులు నిర్దాక్షిణ్యంగా తన కొడుకును తీవ్రంగా కొట్టి జైలు పాల్జేశార ని’ ఇటీవల మతఘర్షణలు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతానికి చెందిన 75 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధురాలు వాహిదాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆవేదన ఆ ఒక్క తల్లిదే కాదు. ఎందరో తల్లుల ఆక్రందనలు ఇలాగే ఉన్నాయి. తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని, తన కొడుకుల్ని పట్టుకెళ్లారని, తమ బంధువులను అకారణంగా పోలీసులు పట్టుకెళ్లారని చెప్పుకొచ్చే వారి సంఖ్య రోజురోజుకూ ఈ ప్రాంతంలో పెరుగుతోంది. ఇలా ఎన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఏదేని ఘటన జరిగిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి పోలీసులు చేతికి దొరికిన అమాయకులను కటకటాల పాల్జేయడం పరిపాటిగా మారిందనడానికి వీరి ఆక్రందనలు సాక్షాలుగానే మిగిలిపోతున్నాయి.. అసలు దోషులు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకొనే దిక్కులేదు. ఈ ఆందోళన సమసిపోయేదెప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు:
ఆటోరిక్షా డ్రైవర్
68 ఏళ్ల వయసున్న ఆటోరిక్షా డ్రైవర్ నిజాముల్లా మాట్లాడుతూ ఎందరో ఎన్నో కుటుంబాలు యువకులు, చిన్నపిల్లలతో కలిసి ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ ప్రాంతం లో ఇంకా ఉద్రిక్తలు తొలగిపోలేదు. పోలీసుల అమానుషత్వానికి అమాయకులు జైలుపాలవుతున్నారనే ఆందోళనతోనే కుటుంబాలతో సహా వెళ్లిపోతున్నారు. కొందరు ఇళ్ల నుంచి ఇంకా బయటకు రావడం లేదని ఇటీవల ఘర్షణల సందర్భంగా శంకర్‌పూర్‌లో తలదాచుకొని రెండ్రోజుల క్రితం ఇక్కడకు తిరిగి వచ్చిన నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పట్లో దుకాణం తెరిచేట్టులేదు:
దుకాణదారుడు శర్మ
త్రిలోక్‌పురిలో ఓ దుకాణం నడుపుతూ జీవిక కొనసాగిస్తున్న మునిష్‌కుమార్ శర్మ మాట్లాడుతూ..ఘర్షణల తర్వాత దుకాణం మూసేశాయాల్సి వచ్చింది. ఇంకా ఉద్రిక్తతలున్నాయి. ఇప్పట్లో దుకాణం తెరిచే పరిస్థితి లేదు. కొందరు వినియోగదార్లు వచ్చి తిరిగిపోతున్నారు. ఇప్పటికే రావాల్సిన నష్టాలు వచ్చాయి. పూటగడవడమే కష్టంగా మారే పరిస్థితులు కళ్లముందు కదలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారు. ఈ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన మొహర్రం ఊరేగింపులో హిందువులు కూడా ఆనందోత్సాహాలతో పాల్గొన్నారని చెప్పాడు. అయితే పోలీసుల నిర్భందం మధ్య మొహర్రంను జరుపుకోలేకపోయామని మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదెక్కడి అన్యాయం?
Published Wed, Nov 5 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement