Trilokpuri
-
ఇదెక్కడి అన్యాయం?
ఇటీవల మతఘర్షణలు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో శాంతిభద్రతల పేరుతో పోలీసులు చేస్తున్న హడావుడి అంతా ఇంతకాదు. చేతికి దొరికిన అమాయకులను అరెస్టు చేసి జైలు పాల్జేస్తున్నారు. ఒకవైపు తొలగిపోని ఉద్రిక్తత కారణగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పోతున్న వైనం. మరోవైపు స్థానికంగా ఉన్న కొందరిని అల్లర్లతో సంబంధం ఉన్నదనే సాకుతో పోలీసుల అరెస్టులు.. వెరసి అమాయక ప్రజలు విలవిల్లాడుతున్నారు. న్యూఢిల్లీ: ‘ఆ ఇంట్లో చీకట్లు అలుముకొన్నాయి..తనకొడుకుని కలుసుకోనీయడం లేదు. ఘర్షణలో నీ కొడుక్కు సంబంధం ఉన్నదని దబాయిస్తున్నారు? ఇదెక్కడి న్యాయం? ఈ ప్రాంతంలో 1984లో సిక్కుల ఊచకోత ఘటన తర్వాత మళ్లీ ఇలాంటి దుర్మార్గాన్ని చూడలేదు. తన కొడుకును అకారణంగా పోలీసులు పట్టుకెళ్లారు. ఘర్షణ జరిగిన రోజు కూడా ఇంటి వద్ద లేడు. మీరట్‌కు వెళ్లి తిరిగొచ్చాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులు నిర్దాక్షిణ్యంగా తన కొడుకును తీవ్రంగా కొట్టి జైలు పాల్జేశార ని’ ఇటీవల మతఘర్షణలు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతానికి చెందిన 75 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధురాలు వాహిదాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆవేదన ఆ ఒక్క తల్లిదే కాదు. ఎందరో తల్లుల ఆక్రందనలు ఇలాగే ఉన్నాయి. తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని, తన కొడుకుల్ని పట్టుకెళ్లారని, తమ బంధువులను అకారణంగా పోలీసులు పట్టుకెళ్లారని చెప్పుకొచ్చే వారి సంఖ్య రోజురోజుకూ ఈ ప్రాంతంలో పెరుగుతోంది. ఇలా ఎన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఏదేని ఘటన జరిగిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి పోలీసులు చేతికి దొరికిన అమాయకులను కటకటాల పాల్జేయడం పరిపాటిగా మారిందనడానికి వీరి ఆక్రందనలు సాక్షాలుగానే మిగిలిపోతున్నాయి.. అసలు దోషులు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకొనే దిక్కులేదు. ఈ ఆందోళన సమసిపోయేదెప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు: ఆటోరిక్షా డ్రైవర్ 68 ఏళ్ల వయసున్న ఆటోరిక్షా డ్రైవర్ నిజాముల్లా మాట్లాడుతూ ఎందరో ఎన్నో కుటుంబాలు యువకులు, చిన్నపిల్లలతో కలిసి ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ ప్రాంతం లో ఇంకా ఉద్రిక్తలు తొలగిపోలేదు. పోలీసుల అమానుషత్వానికి అమాయకులు జైలుపాలవుతున్నారనే ఆందోళనతోనే కుటుంబాలతో సహా వెళ్లిపోతున్నారు. కొందరు ఇళ్ల నుంచి ఇంకా బయటకు రావడం లేదని ఇటీవల ఘర్షణల సందర్భంగా శంకర్‌పూర్‌లో తలదాచుకొని రెండ్రోజుల క్రితం ఇక్కడకు తిరిగి వచ్చిన నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పట్లో దుకాణం తెరిచేట్టులేదు: దుకాణదారుడు శర్మ త్రిలోక్‌పురిలో ఓ దుకాణం నడుపుతూ జీవిక కొనసాగిస్తున్న మునిష్కుమార్ శర్మ మాట్లాడుతూ..ఘర్షణల తర్వాత దుకాణం మూసేశాయాల్సి వచ్చింది. ఇంకా ఉద్రిక్తతలున్నాయి. ఇప్పట్లో దుకాణం తెరిచే పరిస్థితి లేదు. కొందరు వినియోగదార్లు వచ్చి తిరిగిపోతున్నారు. ఇప్పటికే రావాల్సిన నష్టాలు వచ్చాయి. పూటగడవడమే కష్టంగా మారే పరిస్థితులు కళ్లముందు కదలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారు. ఈ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన మొహర్రం ఊరేగింపులో హిందువులు కూడా ఆనందోత్సాహాలతో పాల్గొన్నారని చెప్పాడు. అయితే పోలీసుల నిర్భందం మధ్య మొహర్రంను జరుపుకోలేకపోయామని మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మతసామరస్యానికి ‘పెద్దల’ చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : మొహర్రం ఊరేగింపు విషయమై వాయవ్య ఢిల్లీలోని బవానాలో రెండు మతాల మధ్య తలెత్తిన ఉద్రికత్తను తగ్గించడానికి ఇరుమతాల పెద్దలు శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లుగా గ్రామంలో హిందూ- ముస్లింల మధ్య సామరస్యం లోపించింది. ఈక్రమంలోనే ముస్లింలు మొహర్రం రోజు నిర్వహించే తాజియా ఊరేగింపు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తమ ప్రాంతాల గుండా వెల్లకూడదని పలువురు హిందువులు ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో డిమాండ్ చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో రెండు మతాల పెద్దలు చొరవతీసుకుని ఇరుమతాల వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి కొంత చక్కబడింది. హిందువులు నివసించే ప్రాంతాల గుండా తాజియా ఊరేగింపు నిర్వహించమని ముస్లింలు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. మహా పంచాయతీకి మొర బవానా గ్రామంలో ఓ చిన్న కాలవకు ఒక పక్క హిందువుల కాలనీ, మరో పక్క ముస్లింల కాలనీ ఉంది. ప్రతి ఏటా మొహర్రం రోజు ముస్లింలు నిర్వహించే ‘తాజియాల ఊరేగింపు’ హిందువుల కాలనీ గుండా, మార్కెట్ గుండా సాగుతోంది. గతేడాది కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకొంది. ఈ విషయంపై ఈ సారి కూడా రెచ్చగొట్టే పోస్టర్లు గ్రామంలో గోడలపైనా కరనిపించడం, తాజియా ఊరేగింపు నిషేధించాలన్న డిమాండ్‌తో వాట్సప్ ద్వారా ప్రచారం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఊరేగింపుు రెచ్చగొట్టేదిగా, హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ కాలనీ గుండా అనుమతించరాదనే డిమాండ్‌కు తెరలేపారు. ఈ క్రమంలోనే ఆదివారం బవానా గ్రామంలో మహాపంచాయత్ జరిగింది. ఇందులో 1000 మంది పాల్గొన్నారు. వారంతా ఊరేగింపు తమ కాలనీ గుండా ఊరేగింపు వెళ్లడాన్ని వ్యతిరేకించారు. పీస్ కమిటీ ఏర్పాటు మొహర్రం ను పురస్కరించుకుని త్రిలోక్‌పురిలో జరిగే నాలుగు ఊరేగింపులలో 30 మంది హిందూ వాలంటీర్లు పాల్గొంటారని అమన్ కమిటీ ( శాంతి కమిటీ) సభ్యుడు రియాజుద్దీన్ సైఫీ చెప్పారు. ఒక్కొక్క ఊరేగింపులో 400 మంది పాల్గొంటారన్నారు. ఈ ఊరేగింపులో పాల్గొనే పీస్ కమిటీకి చెందిన హిందూ- ముస్లిం వాలంటీర్లు అనుమానాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచుతారని ఆయన చెప్పారు. వారి కార్యకలాపాలను తక్షణమే పోలీసులకు తెలియచేస్తారని ఆయన చెప్పారు. త్రిలోక్‌పురి, బవానాలో పోలీసులు అప్రమత్తం ఇటీవల త్రిలోక్‌పురి మతఘర్షణలతో అట్టుడికి పోయిన నేపథ్యంలో బవానాలో కూడా అదే పరిస్థితి తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బవానాలో అదనంగా 800 మంది పోలీసు సిబ్బందిని మోహ రించారు. త్రిలోక్‌పురిలో మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగడానికి పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. అదనంగా 200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. బ్లాక్ 27 నుంచి త్రిలోక్‌పురిలోని కోట్లా వద్ద గల కర్బలా వరకు కిలోమీటరు పొడువునా మొహర్రం ఊరిగింపు వెంట పోలీసులు నడుస్తారు. ఊరేగింపులో బ్లేడ్లు, చైన్లు, కొరడాలను వినియోగించడాన్ని నిషేధించారు. తాజియాల ఊరేగింపులో పాల్గొనే ముస్లింలు సాధారణంగా ఈ పరికరాలతో ఒంటిని గాయపరచుకుని తమను తాము హింసించుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి దష్ట్యా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసుల విజ్ఞప్తి చేయడంతో అంగీకరించారు. అధికారులదే బాధ్యత బవానాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే గూగన్ సింగ్ మాట్లాడుతూ.. తాజియా ఊరేగింపు కొనసాగితే, జరిగే హింసాకాండకు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ చెందిన కౌన్సిలర్ దేవేంద్ర కుమార్ కూడా ఊరేగింపు నిర్వహిస్తే ఉద్రిక్తతలు చోటుచేసుకొంటాయన్నారు. రెచ్చగొడుతున్న బీజేపీ : ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ ఇదిలా ఉండగా బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. త్రిలోక్‌పురి, నంద్‌నగరి, బవానా, ముండ్కా ప్రాంతాలలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. మొహర్రం సందర్భంగా భద్రత పటిష్టం న్యూఢిల్లీ: మొహర్రం సందర్భంగా రాజధాని నగరమంతటా పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం చెప్పారు. పుకార్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సీనియర్ పోలీస్ అధికారులు స్థానికంగా శాంతి కమిటీలతో సంప్రదింపులు జరిపారని, మొహర్రం ఊరేగింపుల సందర్భంగా శాంతిని కాపాడుతామని రెండు మతాలకు చెందిన వారు హామీ ఇచ్చారని బస్సీ తెలిపారు. ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీనియర్ అధికారులతో సమావేశమై నగరంలో పరిస్థితిని సమీక్షించారు. -
కోలుకుంటున్న త్రిలోక్‌పురి
న్యూఢిల్లీ: ‘‘ఆలూ ఔర్ టమాటే కిత్నే కే దే రహే హో భాయ్? (బంగాళాదుంపలు, టామాటాలు ఎంతకిస్తున్నావు?)’’ అంటూ ఓ మహిళ సంచార కూరగాయల దుకాణం వ్యాపారిని ప్రశ్నించింది. ‘‘డిమాండ్ చాలా అధికంగా ఉంది. ఇప్పటికే ఓ వ్యాన్ ఖాళీ అయింది. టమాటాలు కిలో రూ.16, ఆలుగడ్డలు రూ.27కి అమ్ముతున్నాం అని ఆ వ్యాపారి జవాబిచ్చాడు. ఈ దృశ్యం త్రిలోక్‌పురిలోని 20వ బ్లాక్‌లో శుక్రవారం కనిపించింది. తొమ్మిది రోజుల క్రితం మద్యం మత్తులో కొందరు యువకులు ఘర్షణకు దిగడం... అవి మతపరమైన అల్లర్లకు దారి తీయడంతో ఉద్రిక్తంగా మారిన త్రిలోక్‌పురి ప్రాంతం నెమ్మదిగా సాధారణస్థితికి చేరుకుంటోంది. పోలీసులు కర్ఫ్యూను పగటిపూట సడలించడంతో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం దాదాపు పది వాహనాల ద్వారా కూరగాయలు, పాల ఉత్పత్తులను విక్రయించింది. స్థానికంగా ఉన్న కిరాణా, వస్త్ర, ఔషధ దుకాణాల షట్టర్లు కూడా తెరుచుకున్నాయి. ‘బంగాళీ డాక్టర్’గా పేరొందిన ప్రదీప్ కుమార్ రాయ్ అనే వైద్యుని వద్ద కూడా రోగులు వైద్యం కోసం రావడం కనిపించింది. పగలంతా సందడిగా కనిపించిన త్రిలోక్‌పురిలో సూర్యాస్తమయం అవుతున్న కొద్దీ ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతూ, భయంకరమైన నిశ్శబ్దం ఆవరిస్తోంది. అప్పుడు పోలీసు వాహనాలు ఎరుపు, నీలం రంగు వెలుగులను విరజిమ్ముతూ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. 15వ బ్లాక్‌లో చేతికి కట్టు కట్టుకొని ఉన్న పద్నాలుగేళ్ల మజీద్ మాట్లాడుతూ, తన తండ్రి మొహమ్మద్ అఖ్తర్‌ను పోలీసులు గత శనివారం లాక్కెళ్లి తీహార్ జైలులో వేశారని చెప్పాడు. ఈ బ్లాక్‌లోనే అల్లర్లు, ఘర్షణలు అధికంగా జరిగినట్లు స్థానికులు చెప్పారు. తాము దేవుని దయపై ఆధారపడి జీవిస్తున్నామని అరుణ్‌కుమార్ అనే మరో స్థానికుడు అన్నారు. ఇక అక్కడే ఉన్న 60 ఏళ్ల తార్సేం సింగ్ మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మీడియా వారు ఒకరి తరువాత ఒకరు వస్తూ, పోతూ ఉన్నారని, తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ‘‘ఆ రోజు ఇక్కడ తుపాకుల మోత కూడా వినిపించింది. ఆ విషయాన్ని మీరు రాయగలరా’’ అని ప్రశ్నించారు. కేవలం మద్యం సేవించిన యువకుల మధ్య ఘర్షణే ఈ అలజడికి కారణం కాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయని శాంతి కమిటీ సభ్యుడు, న్యాయవాది ఆదికేశవన్ అన్నారు. త్రిలోక్‌పురిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు నిండిపోయాయి. మొత్తానికి ఈ ప్రాంతం నెమ్మదిగా కోలుకుంటోంది. -
ప్రశాంతంగానే ఉన్నా కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: మతఘర్షణలతో అట్టుడికిపోయిన త్రిలోక్‌పురిలో 144 సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను బుధవారం ఆరు గంటలపాటు సడలించారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని పోలీసు జాయింట్ కమిషనర్ సంజయ్ బేనీవాల్ చెప్పారు. ప్రజలు అవసరమైన సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా సోమవారం గంట సేపు, మంగళవారం మూడు గంటల పాటు నిషేధాజ్ఞలను సడలించారు. ఛత్ పూజను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని చెప్పారు. ఈ పూజ చేసేవారు సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి వీలుగా సడలింపు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. అక్టోబర్ 23న హిందూ ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 68 మందిని అరెస్టు చేశారు. తమ వద్ద నున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు ఈ అరెస్టులు చేసినట్లు బేనీవాల్ చెప్పారు. ఐదుగురు ప్రధాన నిందితులలో ఇర్ఫాన్‌ను మంగళవారం సాయంత్రం అరె స్టు చేశారు. మిగతా నలుగురు మొబిన్, ఆసిఫ్, తారిఖ్, జాఫర్ కోసం గాలింపు కొనసాగుతోంది. 36 బ్లాకులున్న త్రిలోక్‌పురిలో ఢిల్లీ పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర భద్రతా బలగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు, 30కి పైగా పోలీసు వ్యాన్లు, వాటర్ కేనన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో పహరా కాస్తున్నారు. నిఘా కోసం పోలీసులు డ్రోన్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. త్రిలోక్‌పురిలో నిషేధాజ్ఞలు మరికొన్ని రోజులు కొనసాగించాలని పోలీసులు యోచిస్తున్నారు. పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నందున్న ఏ క్షణాన్నైనా హింస చెలరేగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని బ్లాక్ నంబర్-2లో మాతాకీ చౌకీ ఏర్పాటు చేసిన చోట శుక్రవారం జాగరణ్ నిర్వహించవలసి ఉంద ని, అలాగే నవంబర్ 4న మొహర్రంను పురస్కరించుకుని తాజియాల ఊరేగింపు తీస్తారని, మత సంబంధమైన ఈ రెండు కార్యక్రమాల దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు భద్రతను మరింత కట్టుదిట్టంగా ఉంచవలసిన ఆవశ్యకత ఉందని పోలీసులు అంటున్నారు . -
ఉద్రిక్తంగానే త్రిలోక్‌పురి
సాక్షి, న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన త్రిలోక్‌పురిలో పరిస్థితి అదపులో ఉన్నప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు చెప్పారు. సోమవారం కూడా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కొనసాగాయి. పుకార్లు వ్యాపింప చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ హెచ్చరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో పోలీసుల మోహరింపు మరికొన్ని రోజులు కొనసాగుతుందన్నారు. పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ పిల్లలు స్కూలుకు వెళ్లలేకపోయారని, పాలు, ఇతర నిత్యావసర సరుకులకు కటకటగా ఉందని స్థానికులు చె ప్పారు. పాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాలు, కొన్ని నిత్యావసర సరకులను సోమవరాం స్థానికులకు పంచినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యావసర సరకులు కొరత తమకు సమస్యగా మారిందని స్థానికులంటున్నారు. పుకార్లను నమ్మరాదని కమిషనర్ త్రిలోక్‌పురి వాసులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించామని, పరిస్థితి ప్రశాంతంగా మారగానే వారిపై చర్య తీసుకుంటామని బస్సీ చెప్పారు. పుకార్లు సృష్టిస్తున్న 14 మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు, రాపిడ్ యాక్షన్ బలగాలను భారీగా మోహరించి, నిషేదాజ్ఞలు జారీ చేసినప్పటికీ అలర్లు జరిగిన తూర్పు ఢిల్లీ ప్రాం తంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. త్రిలోక్‌పురి ఘటనను కాంగ్రెస్ ఖండిం చింది.. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ సర్కారుకు ఉందని కాం గ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు. నివేదిక కోరిన హోం శాఖ త్రిలోక్‌పురిలో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పోలీసు విభాగం శనివారం రోజునే ఓ వాస్తవ నివేదికను పంపించింది. కానీ ఘర్షణలకు కారణం, ఉద్రిక్తతలను అణచివేసేందుకు తీసుకున్న చర్యలు, ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాడి ఉందా అన్న అంశంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరింది. త్రిలోక్‌పురిలో మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 13 మంది పోలీసులు సహా 35 మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటికి 70 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. -
కొనసాగుతున్న కర్ఫ్యూ
న్యూఢిల్లీ: నగరంలో ఇటీవల అల్లర్లు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకొన్న దాఖలాలు లేవు. దీపావళి పండుగ సందర్భంగా చిన్న విషయమై రెండు వర్గాల పరస్పరం ఘర్షణకు దిగడంతో ఈ ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలోనే శనివారం మరో ఐదుగురికి తుపాకీ గాయాలైన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం త్రిలోక్‌పురి ప్రాంతంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో, ఆ ప్రాంతంలో ప్రజలు గుంపులుగా ఉండరాదని అధికారులు నిషేధ విధించారని చెప్పారు. శుక్రవారం జరిగిన సంఘటనకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన 70 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. శనివారం సాయంత్రం మరోసారి జరిగిన ఘటనలో ఐదుమందికి తుపాకీ గాయాలయ్యాయని చెప్పారు. రాళ్లు రువ్వుకోవడంతో 14 మంది ప్రజలు, 13 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. వారంతా నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. త్రిలోక్‌పురి ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించినట్లు చెప్పారు. 30 పోలీసు వాహనాలు, వాటర్ క్యానన్స్, అల్లర్ల నియంత్రణ వాహనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. -
త్రిలోక్‌పురి ఘటనలో 33 మంది అరెస్టు
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని బీ బ్లాక్‌లో చిన్న విషయమై జరిగిన ఘర్షణకు సంబంధించిన 33 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్న విషయమై రెండు వర్గాల మధ్య శుక్రవారం జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో 4గురికి తుపాకీ గాయాలు, మరో 13 మంది పోలీసులకూ గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన 10 మంది నిందితులను శుక్రవారం మరో 23 మందిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి..దీపావళి పండుగ రోజు తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని బీ బ్లాక్‌లో రెండు వర్గాలు చిన్న విషయమై ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొన్నారు. రెండు వైపులా కొందరికి గాయాలయ్యాయి. ఘర్షణను అదుపులోకి తేవడానికి రంగంలోకి దిగిన పోలీసుల్లో 13 మందికి రాళ్లదెబ్బలు తగిలాయి. ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులల్లో క్షతగ్రాత్రులు చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ రిజర్వు దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు రంగంలోకి దిగాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి ఉండడంతో 30 పోలీస్ వ్యాన్ లు, వాటర్ క్యానన్లతో అక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పండుగల సందర్భంగా మతకలహాలు చోటు చేసుకోవచ్చని అన్ని రాష్ట్రాలను ఐబీ అప్రమత్తం చేసింది. నగరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనలో ‘నల్గురు వ్యక్తులకు తుపాకీ గాయాలయ్యాయి. కానీ పోలీసుల తుపాకుల వల్ల మాత్రం కాదు. తుపాకీలు పేలుళ్ల వెనుక ఉన్నదెవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి పేర్కొన్నారు. పరిస్థితి అదుపులో ఉంది నగరంలోని ట్రిలోక్పురిలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులకు వెనుకాడేదిలేదని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో పోలీసులతోపాటు ఇంటెలీజెన్సీ విభాగం, ఇతర ఏజెన్సీలు పరిస్థితిని పరిశీలిస్తున్నాయని అన్నారు. పండుగల సందర్భంగా మతకలాహాలు జరుగుతాయనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. -
చెల్లెలిని ప్రేమించాడని 15 కత్తిపోట్లు
అమ్మాయిని ప్రేమించినందుకు ఆమె అన్నలు ముగ్గురు కలిసి దేశ రాజధాని నడిబొడ్డున ఓ వ్యక్తిని కత్తులతో పలుమార్లు పొడిచేశారు. తీవ్ర గాయాల పాలైన సదరు బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సుజిత్ అనే ఈ ప్రేమికుడిని అమ్మాయి అన్నయ్యలు ముగ్గురు, వారి స్నేహితుడొకరు కలిసి ఏకంగా 15 సార్లకు పైగా కత్తులతో పొడిచినట్లు తెలుస్తోంది. తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని తొలుత సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చి, తర్వాత అక్కడినుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడే మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తిపోట్లు పొడిచిన వారిలో అమ్మాయి అన్నల్లో ఒకరితో పాటు వారి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నారు. సుజిత్‌కు ఆ అమ్మాయితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ విషయమై కోపగించిన ఆమె అన్నలు.. కొన్ని రోజుల క్రితమే సుజిత్‌ను తమ చెల్లెలికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ మళ్లీ ఆమె సుజిత్‌తో కలిసి తిరుగుతుండటం చూసి, ఇంటి నుంచి బయటకు పిలిచి పొడిచి పారిపోయారని పోలీసులు తెలిపారు.