న్యూఢిల్లీ: ‘‘ఆలూ ఔర్ టమాటే కిత్నే కే దే రహే హో భాయ్? (బంగాళాదుంపలు, టామాటాలు ఎంతకిస్తున్నావు?)’’ అంటూ ఓ మహిళ సంచార కూరగాయల దుకాణం వ్యాపారిని ప్రశ్నించింది. ‘‘డిమాండ్ చాలా అధికంగా ఉంది. ఇప్పటికే ఓ వ్యాన్ ఖాళీ అయింది. టమాటాలు కిలో రూ.16, ఆలుగడ్డలు రూ.27కి అమ్ముతున్నాం అని ఆ వ్యాపారి జవాబిచ్చాడు. ఈ దృశ్యం త్రిలోక్‌పురిలోని 20వ బ్లాక్‌లో శుక్రవారం కనిపించింది. తొమ్మిది రోజుల క్రితం మద్యం మత్తులో కొందరు యువకులు ఘర్షణకు దిగడం... అవి మతపరమైన అల్లర్లకు దారి తీయడంతో ఉద్రిక్తంగా మారిన త్రిలోక్‌పురి ప్రాంతం నెమ్మదిగా సాధారణస్థితికి చేరుకుంటోంది. పోలీసులు కర్ఫ్యూను పగటిపూట సడలించడంతో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం దాదాపు పది వాహనాల ద్వారా కూరగాయలు, పాల ఉత్పత్తులను విక్రయించింది.
స్థానికంగా ఉన్న కిరాణా, వస్త్ర, ఔషధ దుకాణాల షట్టర్లు కూడా తెరుచుకున్నాయి. ‘బంగాళీ డాక్టర్’గా పేరొందిన ప్రదీప్ కుమార్ రాయ్ అనే వైద్యుని వద్ద కూడా రోగులు వైద్యం కోసం రావడం కనిపించింది. పగలంతా సందడిగా కనిపించిన త్రిలోక్‌పురిలో సూర్యాస్తమయం అవుతున్న కొద్దీ ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతూ, భయంకరమైన నిశ్శబ్దం ఆవరిస్తోంది. అప్పుడు పోలీసు వాహనాలు ఎరుపు, నీలం రంగు వెలుగులను విరజిమ్ముతూ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. 15వ బ్లాక్‌లో చేతికి కట్టు కట్టుకొని ఉన్న పద్నాలుగేళ్ల మజీద్ మాట్లాడుతూ, తన తండ్రి మొహమ్మద్ అఖ్తర్‌ను పోలీసులు గత శనివారం లాక్కెళ్లి తీహార్ జైలులో వేశారని చెప్పాడు. ఈ బ్లాక్‌లోనే అల్లర్లు, ఘర్షణలు అధికంగా జరిగినట్లు స్థానికులు చెప్పారు. తాము దేవుని దయపై ఆధారపడి జీవిస్తున్నామని అరుణ్‌కుమార్ అనే మరో స్థానికుడు అన్నారు.
ఇక అక్కడే ఉన్న 60 ఏళ్ల తార్సేం సింగ్ మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మీడియా వారు ఒకరి తరువాత ఒకరు వస్తూ, పోతూ ఉన్నారని, తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ‘‘ఆ రోజు ఇక్కడ తుపాకుల మోత కూడా వినిపించింది. ఆ విషయాన్ని మీరు రాయగలరా’’ అని ప్రశ్నించారు. కేవలం మద్యం సేవించిన యువకుల మధ్య ఘర్షణే ఈ అలజడికి కారణం కాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయని శాంతి కమిటీ సభ్యుడు, న్యాయవాది ఆదికేశవన్ అన్నారు. త్రిలోక్‌పురిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు నిండిపోయాయి. మొత్తానికి ఈ ప్రాంతం నెమ్మదిగా కోలుకుంటోంది.
కోలుకుంటున్న త్రిలోక్‌పురి
Published Fri, Oct 31 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement