అల్లర్లతో అట్టుడికిన త్రిలోక్‌పురిలో పరిస్థితి అదపులో ఉన్నప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు చెప్పారు. సోమవారం కూడా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కొనసాగాయి.
సాక్షి, న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన త్రిలోక్‌పురిలో పరిస్థితి అదపులో ఉన్నప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు చెప్పారు. సోమవారం కూడా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కొనసాగాయి. పుకార్లు వ్యాపింప చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ హెచ్చరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో పోలీసుల మోహరింపు మరికొన్ని రోజులు కొనసాగుతుందన్నారు. పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ పిల్లలు స్కూలుకు వెళ్లలేకపోయారని, పాలు, ఇతర నిత్యావసర సరుకులకు కటకటగా ఉందని స్థానికులు చె ప్పారు. పాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పాలు, కొన్ని నిత్యావసర సరకులను సోమవరాం స్థానికులకు పంచినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యావసర సరకులు కొరత తమకు సమస్యగా మారిందని స్థానికులంటున్నారు. పుకార్లను నమ్మరాదని కమిషనర్ త్రిలోక్‌పురి వాసులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించామని, పరిస్థితి ప్రశాంతంగా మారగానే వారిపై చర్య తీసుకుంటామని బస్సీ చెప్పారు. పుకార్లు సృష్టిస్తున్న 14 మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు, రాపిడ్ యాక్షన్ బలగాలను భారీగా మోహరించి, నిషేదాజ్ఞలు జారీ చేసినప్పటికీ అలర్లు జరిగిన తూర్పు ఢిల్లీ ప్రాం తంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. త్రిలోక్‌పురి ఘటనను కాంగ్రెస్ ఖండిం చింది.. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ సర్కారుకు ఉందని కాం గ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
నివేదిక కోరిన హోం శాఖ
త్రిలోక్‌పురిలో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పోలీసు విభాగం శనివారం రోజునే ఓ వాస్తవ నివేదికను పంపించింది. కానీ ఘర్షణలకు కారణం, ఉద్రిక్తతలను అణచివేసేందుకు తీసుకున్న చర్యలు, ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాడి ఉందా అన్న అంశంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరింది. త్రిలోక్‌పురిలో మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 13 మంది పోలీసులు సహా 35 మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటికి 70 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.