
రమణమూర్తి మంథా
వజ్రాల వ్యాపారి నీరవ్ దీపక్ మోదీ దెబ్బతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నష్టపోయినదెంత? హామీ లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జారీ చేసిన రూ.11,400 కోట్లు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్‌ల వరకేనా? మరి ఇతర కంపెనీల పేరిట పలు బ్యాంకుల నుంచి ఆయన చేసిన అప్పుల మాటేంటి? ఆయన వ్యాపారాలపై దాడులు జరగడం, మోదీ పారిపోయి అమెరికాలో తలదాచుకున్న నేపథ్యంలో ఇకపై రుణాల చెల్లింపులు జరుగుతాయా? పీఎన్‌బీ ఇన్వెస్టర్ సర్వీసెస్‌తో సహా పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.4,416 కోట్ల అప్పుల మాటేంటి? ఇందులో తీర్చాల్సి ఉన్న వేల కోట్లు బ్యాంకులకు గుదిబండే కదా!! అంటే ఇప్పుడు నీరవ్ కొట్టిన దెబ్బ విలువ రూ.16 వేల కోట్లను కోవాలా? అసలు మన బ్యాంకుల్లో గడిచిన ఐదేళ్లలో నీరవ్ లాంటి ఫ్రాడ్ కేసుల విలువ రూ.64 వేల కోట్లంటే నమ్మగలమా? ఇవన్నీ తట్టుకుని అసలు మన బ్యాంకులు నిలబడతాయా? ఎందరు మోసం చేసినా.. తమకు మూలధనం రూపంలో కేంద్రం డబ్బు లిస్తోంది కదా అనే ధీమాతోనే బ్యాంకులు ఇదంతా చేస్తున్నాయా? ఆ డబ్బంతా ఎవరిది? నిజాయితీగా పన్నులు కట్టేవారిదే కదా!!
విదేశాల నుంచి వజ్రాల్ని దిగుమతి చేసుకోవటానికి మోసపూరిత మార్గాల ద్వారా పీఎన్‌బీ నుంచి నీరవ్ మోదీ పొందిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ల విలువ రూ.11,400 కోట్లు. వాటి ద్వారా దిగుమతులు చేసుకోవటమే కాదు!! దేశీయంగా కూడా రకరకాల కంపెనీల పేర్లతో వివిధ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.4,416 కోట్ల మేర అప్పులు కూడా తీసుకున్నారు. వీటిలో చెల్లించింది చాలా తక్కువ. విశేషమేంటంటే ఈ రుణాలిచ్చిన బ్యాంకుల్లో కూడా పీఎన్‌బీదే అగ్రస్థానం. ఢిల్లీలోని పీఎన్‌బీ శాఖ రూ.3,326 కోట్ల రుణమివ్వగా... ముంబై బ్రాంచీ మరో రూ.514 కోట్ల అప్పు మంజూరు చేసింది. ఇదికాక ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.392 కోట్లు... సూరత్‌లోని రత్నాకర్ బ్యాంక్ నుంచి రూ.184 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇప్పుడు మోదీ పారిపోవటం, ఆయన ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేస్తుండటంతో ఆ రుణాల చెల్లింపు కూడా ప్రశ్నార్థకమైంది.
సన్నిహితులతో కలిసి...
నీరవ్ మోదీ తన సన్నిహితులు హేమంత్ దహ్యాలాల్ భట్, రమేశ్ మాధవ్‌దాస్ అసర్, కేతన్ చంద్రకాంత్ సోలంకి, పరేశ్ ప్రవీణ్‌భాయ్ రాథోడ్, భవీక్ హష్ముక్‌లాల్ దేశాయ్‌తో కలిసి పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, రాధాషిర్ జ్యుయలరీ కంపెనీ, ఫైర్‌స్టోన్ ట్రేడింగ్, ఏఎన్‌ఎం ఎంటర్‌ప్రైజెస్ తదితర పేర్లతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలన్నీ... పీఎన్‌బీ నుంచి తీసుకున్న భారీ రుణాల్లో భాగస్వాములే కావటం గమనార్హం. అంతేకాదు తన భార్య అమీ పేరిట కూడా అమీ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన నీరవ్... అందులో తన కుటుంబ సభ్యుల్ని డైరెక్టర్లుగా చేర్చారు. దాదాపు ప్రతి కంపెనీ విడివిడిగా కూడా భారీగా రుణాలు తీసుకోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
స్వాధీనం చేసుకున్న ఆస్తులెంత?
నీరవ్ మోదీ వ్యవహారాన్ని పీఎన్‌బీ అధికారికంగా బయటపెట్టి.. స్టాక్ మార్కెట్లో దాని పతనం మొదలైన కొన్ని గంటల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన ఆస్తులపై సోదాలు మొదలుపెట్టింది. తొలిరోజే రూ.5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించింది. కాకపోతే.. వాటిని స్వతంత్రంగా విలువ కట్టే పని జరుగుతున్నట్లు కూడా పేర్కొంది. శుక్రవారం ఇంకో ట్వీట్‌లో మరో రూ.550 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అంటే.. రూ.11,400 కోట్ల విలువైన కుంభకోణంలో సగానికి పైగా స్వాధీనం చేసుకున్నట్టేనా!!? దీనిపై ట్వీటర్ వేదికగా పలు సందేహాలు వెల్లువెత్తాయి. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లు మించదని, ఈడీ కావాలనే వ్యవహారాన్ని తేలిక చేయటానికలా చెబుతోందని సీనియర్ జర్నలిస్టు సుచేతా దలాల్ సహా పలువురు విమర్శలు చేశారు. ఇంత త్వరగా వజ్రాల విలువను లెక్కించటం ఎలా సాధ్యమైందని, అసలు లెక్కించటం పూర్తికాకుండా ఎలా ప్రకటించారన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి.
మోసాల సామ్రాజ్యం ఇంతింత కాదు
నీరవ్ మోదీ మోసం రూ.11,400 కోట్లే! కానీ గడిచిన ఐదేళ్లలో ఘరానా మోసగాళ్లు ఏకంగా రూ.61 వేల కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేశారు. ఈ విషయాన్ని స్వయంగా బ్యాంకులే ఆర్‌బీఐకి నివేదించాయని, ఇది సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైందని ‘బ్లూమ్‌బర్గ్’వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 8,670 కేసుల్లో ఈ మేరకు మోసం జరిగినట్లు తెలియజేసింది. మరోవంక బ్యాంకుల మొండి బకాయిలు సైతం రూ.9 లక్షల కోట్లను దాటేసిన సంగతి తెలిసిందే. చిత్రమేంటంటే బ్యాంకుల మూలధనం ఇలా మోసాలు... మొండి బకాయిల రూపంలో హరించుకుపోతుండటంతో సాధారణ రుణాలివ్వటానికి వాటికి నిధుల కొరత ఏర్పడుతోంది. ఆ కొరతను తీర్చటానికి ప్రభుత్వం తాజాగా రూ.2.1 లక్షల కోట్లను మూలధనం రూపంలో ఇస్తామని ప్రకటించి.. ఆ మేరకు అందజేస్తోంది కూడా. పీఎన్‌బీకి తాజా త్రైమాసికంలో కేంద్రం రూ.12 వేల కోట్ల మేర మూలధనాన్ని అందజేసింది. కాకపోతే నీరవ్ మోదీ ఒక్కడే ఆ మొత్తాన్ని కాజేశాడు!! అదే తమాషా.
ఏదైనా ప్రభుత్వ బ్యాంకేగా!!
నీరవ్ మోదీ పలు బ్యాంకుల నుంచి రుణాలే కాక.. పీఎన్‌బీ నుంచి రూ.11,400 కోట్ల మేర లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్‌లను పొందాడు. ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం...
1. ఇవి కూడా బ్యాంకు గ్యారంటీల్లాంటివే. మనకు బ్యాంకులో ఉండే డిపాజిట్లు చూసో, ఆస్తుల్ని హామీగా పెట్టుకునో బ్యాంకులు ఈ గ్యారంటీలు మంజూరు చేస్తాయి కదా!! ఎల్‌ఓయూలూ అలాంటివే. కాకపోతే నీరవ్‌కు ఎలాంటి హామీ లేకుండా ముంబైలోని ఓ పీఎన్‌బీ శాఖ వీటిని మంజూరు చేసేసింది.
2. ఈ ఎల్‌ఓయూలను విదేశాల నుంచి వజ్రాలు దిగుమతి చేసుకోవటానికి వాడుకున్నాడు నీరవ్ మోదీ. వాటిని విదేశాల్లోని భారతీయల బ్యాంకులకిచ్చాడు. అవి పీఎన్‌బీ జారీ చేసినవి కావటంతో వాటికి చెల్లింపులు చేయాల్సింది పీఎన్‌బీయే. దీంతో బ్యాంకులు అక్కడి ఎగుమతి దారులకు డబ్బులు చెల్లించేశాయి.
3. ఆ బ్యాంకులు తిరిగి తమ డబ్బులివ్వాలని పీఎన్‌బీని అడగటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పీఎన్‌బీ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
4. పీఎన్‌బీకి మోదీ ఎలాంటి చెల్లింపులూ చేయలేదు కనక మునిగిపోయింది పీఎన్‌బీయే. అది మొత్తం రూ.11,400 కోట్లను ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. నిజానికి పీఎన్‌బీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30 వేల కోట్లు. అంటే తన మొత్తం విలువలో మూడో వంతును అది మోసపోయిందన్న మాట!!
Comments
Please login to add a commentAdd a comment