గడ్చిరోలిలో మావోయిస్టుల దాడి
మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి
గడ్చిరోలి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దాడికి తెగబడ్డారు. చామూర్శి తాలూకా పవిమురాండా-మురమాడి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. ఆదివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ఎట్టపెల్లి తాలూకాలోని కసన్‌సూర్ అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో సీ-60 పోలీసుల బృందం కూంబింగ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. నాలుగైదు రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ గాలించినా నక్సల్స్ ఆచూకీ లభించకపోవడంతో 8 వాహనాల్లో తిరిగి గడ్చిరోలి బయలుదేరారు. వారి వాహనాలు ప్రయాణించే మార్గంలో మురమాడి గ్రామానికి చేరువలోని ఒక వంతెన వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చేశారు.
అప్పటికే రెండు వాహనాలు దాటుకుని వెళ్లగా, మూడో వాహనం పేలిపోయింది. అందులో ఉన్న తొమ్మిది మంది పోలీసుల్లో ఏడుగురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. మృతిచెందిన పోలీసులను దీపక్ విఘావే, సునీల్ మడావి, రోహన్ దంబారే, సుభాష్ కుమ్రే, తిరుపతి ఆలం, లక్ష్మణ్ ముండే, దుర్యోధన్ నాకతోడేగా గుర్తించారు. మావోయిస్టు పార్టీ ‘థింక్‌ట్యాంక్’గా గుర్తింపు పొందిన ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టుకు నిరసనగానే మావోలు ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డిమాండ్ చేశారు.
30 కిలోల ఐఈడీ స్వాధీనం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బృందాలు ఆదివారం 30 కిలోల అధునాతనమైన పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు.
మైన్‌ప్రూఫ్ వాహనాల వాడుకపై పరిమితులు: మందుపాతరల పేలుళ్ల సంఘటనల్లో బలగాల మరణాలను తగ్గించే ఉద్దేశంతో మైన్‌ప్రూఫ్ వాహనాల వినియోగాన్ని పరిమితం చేయాలని, రొటీన్ ఆపరేషన్ల కోసం మైన్‌ప్రూఫ్ వాహనాలను వినియోగించరాదని సీఆర్పీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నక్సల్ ప్రాంతాల్లోని తన బలగాలకు మార్గదర్శకాలను పంపింది.