ప్రమాదంలో చనిపోయిన గాంధీ.. | Gandhi Died by Accident: Odisha Government Booklet | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో రగడ : ‘గాంధీ గారు ప్రమాదవశాత్తు చనిపోయారు’

Published Fri, Nov 15 2019 8:27 PM | Last Updated on Fri, Nov 15 2019 8:39 PM

Gandhi Died by Accident: Odisha Government Booklet - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : మహాత్మా గాంధీ ఎలా చనిపోయారన్నది దేశం మెత్తం తెలుసు. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో అక్టోబర్‌ 30, 1948న నాథూరాం గాడ్సే చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. హత్యానంతరం గాడ్సేని దోషిగా తేల్చి చట్టపరంగా ఉరి తీశారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్‌లెట్‌ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్‌ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బుక్‌లెట్‌లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. 

కాగా ఒడిశా విద్యాశాఖ రూపొందించిన  బ్రోచర్‌లో గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారంటూ, చనిపోయింది ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో అని రెండు పేజీల బ్రోచర్‌లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీని నిలదీసింది. మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై అసెంబ్లీలో సీఎల్పీ లీడర్‌ నరసింహ్‌ మిశ్రా మాట్లాడుతూ.. గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశాడని, అనంతరం అతనిని ఉరి తీశారని తెలీదా? అని ప్రశ్నించారు.ఈ తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ ముఖ్యమంత్రికే ఇందులో భాగస్వామ్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

గాడ్సేని బీజేపీలోని కొందరు నాయకులు దేవుడిలా భావిస్తున్నారని, ఈ ప్రభుత్వ తీరు చూస్తే బీజేడీ కూడా ఆ భావజాల ప్రభావానికి లొంగిపోయినట్టు భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని అధికార బీజేడీ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. చరిత్రను ఎవరూ మార్చలేరని అధికార పార్టీ సభ్యుడు సౌమ్య రంజన్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఈ ఘటనపై శనివారం (రేపు) వివరణనివ్వాలని స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రో ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement