లక్నో: ‘‘పోలీసులు ఆయనను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత నాశనం చేశారు. అయినప్పటికీ రాజ్యాంగం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. నా భర్త చనిపోయాడు. కానీ నా ఆశలు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఆయన నేరస్తుడే కావొచ్చు. అయితేనేం తనో మంచి భర్త, తండ్రి’’ అంటూ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే భార్య రిచా దుబే ఉద్వేగానికి లోనయ్యారు. జూలై 2 రెండు రాత్రి బిక్రూలో ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొన్నారు. పోలీసులపై కాల్పుల ఘటన తర్వాత భర్త తనకు ఫోన్ చేశాడని, తనతో మాట్లాడటం అదే చివరిసారి అని చెప్పుకొచ్చారు. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా)
కాగా ఎన్నో అరాచకాలకు పాల్పడి, ఎంతో మంది అమాయకులను, ఆఖరికి పోలీసులను సైతం పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే జూలై 10న యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరైన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణ కమిటీ నియమించేందుకు సిద్ధమైంది.(ఒక్క ఫిర్యాదు.. పోలీసుల మరణం.. దుబే హతం!?)
ఈ నేపథ్యంలో రిచా దుబే స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా భర్తతో తన అనుబంధం, తమ కుటుంబం గురించి చెప్పుకొచ్చారు.‘‘ నా సోదరుడు రాజు నిగమ్‌కు దుబే స్నేహితుడు. 1990లో తొలిసారి ఆయనను కలిశాను. మా అన్నయ్యే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. బిక్రులో మా ఆయన మాటే ఫైనల్. దుబే కరుడుగట్టిన నేరస్తుడే అయినప్పటికీ భార్యాపిల్లలను ప్రేమించే వ్యక్తిత్వం ఆయనది. పిల్లలంటే ఆయనకు చాలా ప్రేమ.
ప్రతినెలా ఖర్చుల కోసం రూ .40 వేలు పంపించేవారు. మా పెద్ద కొడుకు శంతను రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడు. చిన్న కొడుకు ఆకాశ్ క్లాస్ 12 పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించాడు. స్థానిక రాజకీయాలు, సమస్యలు పిల్లలపై ప్రభావం చూపడకూడదనే ఉద్దేశంతో 2004లో లక్నోలో ఇళ్లు నిర్మించారు. వాళ్లిద్దరు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని ఆశించేవారు. తల్లిదండ్రులను కూడా అమితంగా గౌరవించేవాడు’’ అని పేర్కొన్నారు.(అందుకే దుబేకు సంకెళ్లు వేయలేదు!)
అదే విధంగా.. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో బిక్రూలో పోలీసులకు డిన్నర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఆరోజు రాత్రి బిక్రూలో ఏం జరిగిందో తెలియదు. జూలై 3 వేకువజామున 2 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. లక్నోలోని ఇంటికి పారిపొమ్మని చెప్పాడు. నేను వెంటనే నా స్నేహితుల సాయంతో తప్పించుకున్నాను. ఆరోజే చివరిసారి ఆయనతో మాట్లాడటం. ఆ తర్వాత మీడియా ద్వారానే మిగతా వివరాలు తెలిశాయి’’అని తన భర్తతో జరిగిన చివరి సంభాషణ గురించి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment