సాక్షి, బెంగళూరు: సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ దారుణ హత్యపై నిరనన వెల్లువెత్తింది. దేశవ్యాప‍్తంగా జర్నలిస్టులు గౌరీ హత్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక‍్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె హత్యకు గురైన బెంగళూరు నగరంలోని మీడియా హాల్ లో వివిధపత్రికలకు చెందిన పాత్రికేయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూండాల తూటాలకు జర్నలిజం తలవంచదని నినదించారు. బుధవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఈ నిరసన సాయంత్రం వరకు కొనసాగనుంది. ఐయామ్ ఆల్సో గౌరి ప్లకార్డులతో , గౌరీ అమర్ రహే నినాదాలతో టౌన్‌హాల్ దద్దరిల్లిపోయింది.
గౌరి లంకేష్‌హత్యపై ఎడిటర్ గిల్డ్స్ సహా దేశవ్యాప్తంగా పలువురు సీనియర్లు పాత్రికేయులు, ఇతర జర్నలిస్టులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. మత దురహంకార హత్యను ఖండిస్తూ ఆమెకు నివాళులర్పించారు. హైదరాబాద్ జైపూర్ ,గుజరాత్, ఢిల్లీ, ముంబై, చెన్నై, చండీగడ్, లక్నో,కోలకతా నగరాల్లో జర్నలిస్టుల సంఘాలు, ప్రెస్ క్లబ్‌ల ఆధ్వర్యంలో గౌరి హత్యను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.
దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు , సాయంత్రం 4 గంటలకు బషీర్‌బాగ్ కార్యాలయంలో మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
మరోవైపు గౌరి పార్ధివ దేహానికిపోస్ట్‌మార్టం అనంతరం ఈ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. గౌరి కోరిక మేరకు ఆమె నేత్రాలను దానం చేసినట్టు గౌరి సోదరుడు, ఫిలిం మేకర్ ఇంద్రజిత్ లంకేష్ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిపించాలని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనను కుటుంబసభ్యుల సమంక్షంలో, ముఖ్యంగా తాను, గౌరి తల్లి సమక్షంలో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.