
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం
దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు
ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం
కఠ్మాండు: కల్లోల నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ అనిశ్చితి ముగిసింది. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ(73)ని పదవి వరించింది. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఆమె శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకా రం చేశారు. హిమాలయ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.
అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రెసిడెంట్ ఆఫీసు లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడు రామ్‌సహాయ్ యాదవ్, సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్‌మన్‌సింగ్ రావత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన తాత్కాలిక ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఎన్నిక లు నిర్వహిస్తుందని రామచంద్ర పౌడెల్ చెప్పారు.
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడం తెలిసిందే. తాత్కాలిక ప్రధానమంత్రి ఎంపికపై జెన్ జెడ్ ప్రతినిధులతో జరిగిన చర్చలు శుక్రవారం కొలిక్కి వచ్చాయి. జస్టిస్ సుశీల కర్కీకి జెన్ జెడ్ మద్దతు లభించింది. ఎక్కువ మంది ఆమె వైపే మొగ్గు చూపారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్, జెన్ జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో జస్టిస్ సుశీల ఎంపికకు ఆమోదముద్ర వేశారు.
దాదాపు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలసింది. నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఇప్పటికే రికార్డుకెక్కారు. తాత్కాలిక ప్రధానమంత్రి హోదాలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిందిగా తొలి కేబినెట్ సమావేశంలో అధ్యక్షుడికి సిఫార్సు చేయనున్నారు. ఈ మేరకు జెన్ జెడ్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరింది. దేశంలో అవినీతి అరికట్టాలని యువత ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి..
జస్టిస్ సుశీల 1952 జూన్ 7న తూర్పు నేపాల్‌లోని బిరాట్‌నగర్‌లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈ ప్రాంతం ఇండియా సరిహద్దులోనే ఉంది. ఆమెకు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. 50 ఏళ్ల క్రితం భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశారు. అనంతరం నేపాల్‌లో న్యాయ విద్య అభ్యసించి, న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.
2016 జూలైలో నేపాల్ సుప్రీంకోర్టులో 24వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 11 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. జస్టిస్ సుశీల తల్లిదండ్రులకు మొత్తం ఏడుగురు సంతానం కాగా, అందరికంటే ఆమె పెద్ద. ప్రముఖ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు దుర్గాప్రసాద్ సుబేదీని జస్టిస్ సుశీల పెళ్లిచేసుకున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. జస్టిస్ సుశీల పలు పుస్తకాలు రచించారు.
భారతీయ మహిళ సహా 51 మంది మృతి
నేపాల్‌లో జరుగుతున్న హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరింది. వీరిలో ఒక భారతీయ మహిళ, ముగ్గురు పోలీసులు సైతం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. 36 మృతదేహాలకు శుక్రవారం త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం ప్రారంభించారు. నేపాల్‌లో జరిగిన హింసాకాండలో మరణించిన భారతీయ మహిళను రాజేశ్‌దేవి(55)గా గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్.
ఆమె బస చేసిన కఠ్మాండు హోటల్‌కు మంగళవారం ఆంందోళనకారులు నిప్పుపెట్టారు. బయటపడేందుకు ప్రయతి్నస్తూ ఆమె మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌దేవి భర్త రామ్‌వీర్‌సింగ్ సైనీ హోటల్ కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. నేపాల్‌లో గత వారం రోజుల్లో ఘర్షణల్లో మృతిచెందినవారిలో 19 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1,700 మంది గాయపడ్డారు. హింసాకాండ శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఆందోళనకారులు శాంతించారు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది.