స్వలింగ సంపర్కం నేరపూరితం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంపై స్వలింగ సంపర్కులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమ జీవించే హక్కును కాలరాసిందని మండిపడ్డారు. ఇది తమకు బ్లాక్ డే అని అభివర్ణించారు. తీర్పు వెలువడిన వెంటనే కోర్టు వెలుపల ఉన్న పలువురు స్వలింగ సంపర్కులు కన్నీటి పర్యంతమయ్యారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 377 సెక్షన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా ఈ తీర్పు సరికాదని, దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తామని నాజ్ ఫౌండేషన్ తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు.
తిరోగమన తీర్పు: జైరామ్ రమేశ్
సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ తప్పుబట్టారు. దీన్ని తిరోగమన తీర్పుగా అభివర్ణించారు. ఆధునిక ఉదారవాద దేశంలో ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కంలో నేరం ఏముందన్నారు.
తీర్పుపై కేంద్రం శాసన బాట!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై శాసన బాట పట్టనున్నట్లు కేంద్రం సంకేతమిచ్చింది. ఒక చట్టం రాజ్యాంగబద్ధతను పరీక్షించే విచక్షణాధికారం సుప్రీంకోర్టుకు ఉందని...సుప్రీం జడ్జీలు వారి విచక్షణాధికారాలను ఉపయోగించారని...చట్టాలు చేసే అధికారాలున్న తాము కూడా విచక్షణాధికారాలను ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ ప్రముఖుల అసంతృప్తి
సుప్రీం తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు మానవ హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని...ఇది సిగ్గుచేటని బాలీవుడ్ నటులు ఆమిర్‌ఖాన్, జాన్ అబ్రహాం పేర్కొనగా సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ విమర్శించారు. ఈ తీర్పుపై దక్షిణాసియా గే హక్కుల సంస్థ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.