
దుర్గా మాత విగ్రహాన్ని అప్పగించనున్న జర్మనీ
జమ్మూ కశ్మీర్‌లోని ఓ ఆలయంలో చోరీకి గురై జర్మనీలోని ఓ మ్యూజియంలో ప్రత్యక్షమైన 9వ శతాబ్దం నాటి దుర్గామాత విగ్రహాన్ని జర్మనీ భారత్‌కు ఈవారంలో అప్పగించనుంది.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని ఓ ఆలయంలో చోరీకి గురై జర్మనీలోని ఓ మ్యూజియంలో ప్రత్యక్షమైన 9వ శతాబ్దం నాటి దుర్గామాత విగ్రహాన్ని జర్మనీ భారత్‌కు ఈవారంలో అప్పగించనుంది. జర్మనీలోని భారత దౌత్య కార్యాలయ అధికారులకు ఈ నెల 23న ఈ విగ్రహాన్ని అప్పగించే అవకాశాలున్నాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు.
ఈ నెల 26న లేదా 27న ఇది భారత్‌కు చేరొచ్చని చెప్పారు. 1990లో జమ్మూ కశ్మీర్, పుల్వామాలోని ఓ ఆలయంలో దుర్గామాత విగ్రహం చోరీకి గురైంది. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విగ్రహం జర్మనీలోని లిండెన్ మ్యూజియంలో ఉన్నట్లు 2012లో పోలీసులకు సమాచారం అందింది. విగ్రహం భారత్‌కు చెందినదన్న పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అక్కడి అధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో జర్మనీ దీన్ని తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విగ్రహాన్ని దేశాన్ని దాటించడంలో స్మగ్లర్ సుభాష్ కపూర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కపూర్‌ను జర్మనీ 2011లో అరెస్ట్ చేసింది.