వేధింపుల కేసులో బీజేపీ అగ్రనేత
పనాజీ : గోవా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ హోబ్లే చిక్కుల్లో పడ్డాడు. వరకట్న వేధింపుల కేసులో అనిల్, ఆయన భార్య, కుమారుడు మిలింద్‌పై గోవా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కట్నం కోసం వేధించడంతో కోడలు తల్లి ఫిర్యాదుతో మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కాగా ముంబాయికి చెందిన సుచిత్రా శిరోద్కర్ కుమార్తెకు,మిలింద్‌కు 2009లో వివాహం జరిగింది. అప్పటి నుంచి వరకట్నం కోసం అనిల్ హోబ్లే కుటుంబం తన కుమార్తెను వేధిస్తోందని సుచిత్ర తన ఫిర్యాదులో తెలిపారు.
మంగళవారం తన కుమార్తెపై హోబ్లే కుటుంబం దాడి కూడా చేసినట్లు సుచిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తె ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు గోవా పోలీసులు అనిల్ హోబ్లే కుటుంబంపై 498(ఏ), సెక్షన్- 323(గాయపరచటం), సెక్షన్-506(కుట్రపూరితంగా వ్యవహరించడం), 1961 వరకట్న వేధింపుల నివారణ చట్టం సెక్షన్-3, 4 ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని అనిల్ హోబ్లే కొట్టిపారేశారు. సరైన సమయంలో అన్ని విషయాలు మీడియాకు వివరిస్తానని అన్నారు. కాగా కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.