ఎట్టకేలకు ‘గోద్రా’ నిందితుడు అరెస్ట్
14 ఏళ్ల అనంతరం మహ్మద్ భానా అదుపులోకి
♦ ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా పట్టుకున్న గుజరాత్ పోలీసులు
♦ ఇన్నాళ్లూ ముంబైలో స్థిరాస్తి బ్రోకర్‌గా అవతారం
♦ గోద్రాకు రాకపోకలు ప్రారంభమవడంతో నిఘా పెంపు
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోద్రా రైలు మారణహోమం ప్రధాన నిందితుడు ఫరూక్ మహ్మద్ భానాను గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అతను 14 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. రహస్య సమాచారంపై స్పందిం చిన అధికారులు భానా ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా కాలోల్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఏటీఎస్ ఐజీ జేకే భట్ తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టడానికి భానా కుట్రపన్నాడని ఏటీఎస్ అధికారులు చెప్పారు. ఏటీఎస్ ప్రకారం.... ఘటన జరిగినప్పుడు భానా గోద్రాకు కార్పొరేటర్‌గా ఉన్నాడు. ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన మౌలానా ఉమర్జీ సూచనల మేరకు భానా, మరో కార్పొరేటర్ బిలాల్ హజితో కలసి రైలుకు నిప్పంటిచాలని ఇతర నిందితులకు సమాచారం అందించాడు. గోద్రా ప్రమాదంలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. తదనంతరం చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది చనిపోయారు.
రెండు నెలల ముందే మొదలైన నిఘా
గోద్రా ఘటన జరిగిన చాన్నాళ్ల తరువాత భానా గోద్రాకు రాకపోకలు సాగించడంతో రెండు నెలల నుంచి ఏటీఎస్ నిఘా పెంచింది. పదేళ్లుగా అతను ముంబైలోని అంధేరీ మురికి వాడలో నివసిస్తున్నాడు. ‘‘ఈ మధ్యకాలంలో భానా పాకిస్తాన్‌కు కూడా వెళ్లిన ట్లు తెలిసింది. షేక్ ఉమర్‌గా పేరు మార్చుకొని స్తిరాస్థి బ్రోకర్‌గా పనిచేశాడు. ఎవరూ గుర్తించకుండా ఉండడానికి గడ్డం పెంచాడు. 16ఏళ్లు గడిచాక సొంతూ రు రావడం క్షేమం అనుకొని ఉంటాడు’’ అని ఏటీఎస్ ఐజీ జేకే భట్ చెప్పారు. 16 ఏళ్ల కాలంలో ఈ కేసుకు సంబంధించి 94 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది.