
రద్దయిన నోట్లతో కనకాభిషేకం!
► దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు
► ఢిల్లీలో ఇంతవరకు రూ. 650 కోట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లతో అక్రమార్కులు బంగారు పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని ఈ డబ్బుతో నల్లకుబేరులు భారీగా బంగారాన్ని కొంటున్నారు. బులియన్ వ్యాపారులు పకడ్బందీగా ఈ నోట్లకు కనకపు కడ్డీలను అమ్ముకుని దర్జాగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను(ఐటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన దాడుల్లో కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢిల్లీ ‘నోట్లకు బంగారం’ లావాదేవీలకు అడ్డాగా మారింది. ఇంతవరకు రూ. 650 కోట్లకు పైగా విలువైన ఇలాంటి అమ్మకాలను ఢిల్లీలో గుర్తించారు.
తాజా దాడుల్లో..
ఢిల్లీలోని కరోల్ బాగ్, చాందినీ చౌక్ తదితర చోట్ల షాపులు, బులియన్ వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 250 కోట్ల బంగారం అమ్మకాలు బయటపడ్డాయి. రద్దయిన నోట్లకు నలుగురు ట్రేడర్లు బంగారాన్ని అమ్మినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన నోట్లకు బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును డొల్ల(షెల్) ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు.. నోట్ల రద్దు తర్వాత ఢిల్లీలోనే జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల లెక్కల్లో చూపని బంగారం అమ్మకాలు వెలుగు చూశాయి. ఇద్దరు దళారులను, ఇద్దరు బ్యాంకు మేనేజర్లను అరెస్ట్‌చేశారు. కాగా, బెంగళూరులో శుక్రవారం బులియన్ ట్రేడర్లు, నగల వ్యాపారుల షాపుల్లో, ఇళ్లలో జరిపిన దాడుల్లో రూ. 47 కోట్ల లెక్కచెప్పని ఆదాయం బయటపడింది. ఆగ్రాలో ఓ బులియన్ గ్రూపుపై జరిపిన దాడుల్లో.. లెక్కల్లో లేని 12 కోట్ల డబ్బు బయటపడింది.
కేరళలో రూ.39 లక్షలు సీజ్
మలప్పురం: కేరళలో రద్దయిన నోట్లకు మార్పిడి చేసిన రూ. 39.98 లక్షల విలువైన 2000 కరెన్సీని జప్తు చేశారు. తిరూర్ వ్యాపారి షాబిర్ బాబు ఇంట్లో ఈ మొత్తం బయటపడింది. దళారిగా వ్యవహరించిన అలీని అరెస్ట్ చేసి, అతనికి షాబిర్ నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన రూ. 3 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ అధికారులు మీడియాలో చర్చించొద్దు..
అధికార నిర్ణయాలపై ఐటీ అధికారులు ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లలో చర్చించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింది. అధికార నిర్ణయాలతోపాటు, రహస్యంగా జరిపే అధికార భేటీల వివరాలపైనా కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని, ఇకపై దీన్ని మానుకోవాలని స్పష్టం చేసింది.
నేటి నుంచి ‘నగదు రహిత’ అవార్డులు
నగద రహిత(డిజిటల్) చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజీ ధన్ వ్యాపార్ యోజన’ అవార్డులు ఆదివారం నుంచి 100 నగరాల్లో ప్రారంభం కానున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది విజేతలకు రూ. 100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. మరో పథకం కింద ప్రతివారం గెలిచిన వ్యాపారికి గిఫ్ట్‌లిస్తారు.
430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మేశారు!
ప్రత్యేక రాయితీ పథకం కింద సుంకం కట్టకుండా దిగుమతి చేసుకున్న వందల కేజీల బంగారాన్ని ఓ సంస్థ అడ్డదారిలో అమ్మేసి అడ్డంగా దొరికిపోయింది. నోయిడా సెజ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెజర్స్ శ్రీలాల్ కంపెనీ రూ. 140 కోట్ల విలువైన 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మినట్లు రెవిన్యూ(డీఆర్‌ఐ) అధికారులు గురు, శక్రవారాల్లో జరిపిన దాడుల్లో బయటపడింది. ఈ కంపెనీలో, కంపెనీ అధికారుల ఇళ్లలో దాడులు జరిపి రూ. 2.60 కోట్ల నగదు(రూ. 12 లక్షల కొత్త నోట్లతో కలిపి), 15 కేజీల బంగారు నగలు, 80 కేజీల వెండిని సీజ్ చేశారు. నోట్లను రద్దు చేసిన నవంబర్ 8న ఈ కంపెనీ 24 కేజీల బంగారాన్ని కొని రద్దయిన నోట్లకు అమ్మినట్లు గుర్తించారు.