సాక్షి,ముంబయి: పండుగ సీజన్‌లో దేశంలో పసిడికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సీజన్‌లో పన్ను బెడదను తప్పించుకునేందుకు, నూతన నిబంధనలను పక్కదారి పట్టించేందుకు బంగారం కొనుగోలుదారులు ప్రయత్నించే క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది.ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగారం విక్రయాలను మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం కిందకు తేవడంతో రూ 50,000కు మించి బంగారం కొనుగోలు చేసే కస్టమర్ల ఐడీ నెంబర్లు, లావాదేవీల సంబంధిత ట్యాక్స్ కోడ్ నెంబర్ల రికార్డును జ్యూవెలర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే బంగారం కొనుగోళ్లపై మనీల్యాండరింగ్ చట్ట నిబంధనల అమలు గురించి ప్రభుత్వం ప్రచారం చేయకపోవడంతో కస్టమర్లకు వీటిపై అవగాహన కొరవడింది.
దీంతో అవసరమైన వివరాలు అందించేందుకు కస్టమర్లు నిరాకరిస్తున్నారని జ్యూవెలరీ ట్రేడర్లు చెబుతున్నారు. కొందరు కస్టమర్లు బిల్లులు లేకుండా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో పండగ సీజన్‌లో బ్లాక్ సేల్స్ పెరుగుతాయని ఇండియన్ బులియన్ జ్యూవెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ మెహతా పేర్కొన్నారు.
నూతన నిబంధన నేపథ్యంలో కస్టమర్లు అవసరమైన వివరాలు ఇవ్వకపోగా, పన్నుపోటు నుంచి తప్పించుకునేందుకు సరైన రసీదులు లేకుండానే బంగారం కొనుగోలు చేస్తున్నారని కోల్‌కతాకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి, జేజే గోల్డ్ హౌస్ అధినేత హర్షద్ అజ్మేరా చెప్పారు.జీఎస్‌టీలో భాగంగా బంగారంపై అమ్మకం పన్నును 1.2 నుంచి 3 శాతానికి పెంచిన విషయం విదితమే. ఇక ప్రభుత్వ పన్ను, ఇతర నిబంధనల నేపథ్యంలో జ్యూవెలర్లు నగదు రాయితీపై స్మగుల్డ్ గోల్డ్‌ను కొని, ఆభరణాలను తయారు చేసి వాటిని రసీదులు లేకుండా విక్రయిస్తున్నారని చెన్నైకి చెందిన బులియన్ వ్యాపారి దమన్ ప్రకాష్ రాథోడ్ తెలిపారు.