
బైక్ టాక్సీలకు గ్రీన్ సిగ్నల్
ట్రాఫిక్ రద్దీతో... సమయం చూసి అధిక రేట్లతో బాది పారేస్తున్న క్యాబ్ సర్వీసులతో విసిగిపోయిన మెట్రోనగర వాసులకు ఇక ఊరట లభించనుంది. దేశంలో మోటార్ బైక్ సర్వీసులకు కేంద్రం ఒకే చెప్పనున్నట్టు తెలుస్తోంది. టూ వీలర్ టాక్సీ సర్వీసులకు చట్టబద్థత తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కేంద్ర మోటార్ వెహికల్ చట్టాన్ని సవరణ తీసుకొచ్చే యోచనలో ఉంది. వీటిని చట్టబద్ధం చేయడంతోపాటు..త్వరలోనే సమగ్రమైన మార్గనిర్దేశకాలను రూపొందించనుంది.
కేంద్ర రవాణా శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలకు ఉమ్మడి సమగ్ర విధానంకోసం చర్చిస్తున్నారని రవాణా అధికారి తెలిపారు. రాష్ట్ర రవాణామంత్రులతో కూడిన నిపుణుల బృందం దీనిపై చర్చించి విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి సృష్టించడంతో పాటు ప్రజా రవాణా విస్తరించే అవకాశమున్నందున భారత ప్రభుత్వం మోటర్ బైక్ టాక్సీ వ్యవస్థపై ఆశాజనకంగా ఉందన్నారు.
అయితే కేవలం కమర్షియల్ గా నమోదు చేసుకున్న ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు మాత్రమే అవకాశమన్నారు. రిఫ్లెక్టర్ జాకెట్ తో పాటు హెల్మెట్ విధిగా ధరించాలనే నిబంధనను కూడా పొందుపర్చనున్నారు. ఇప్పటికి చాలా టాక్సీ ఎగ్రిగేటర్స్ ప్రయివేటు వాహనాలను టూ వీలర్ టాక్సీలుగా వాడుకుంటున్నట్టుగా తమ దృష్టికివచ్చిందని..దీన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ లైసెన్సింగ్ విధానం దేశవ్యాప్తంగా ఒకే లా ఉండాలని ఎం టాక్సీ వ్యవస్థాపకుడు అర్నబ్ మాధుర్ పేర్కొన్నారు.తాము కూడా కేంద్ర రవాణా శాఖకు ఒక వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయన్నారు.