జయకు గవర్నర్ పరామర్శ
- సీఎం కోలుకోవడంపై హర్షం.. వైద్యులను అభినందించిన విద్యాసాగర్‌రావు
- పరిస్థితి వివరించిన అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో తమిళనాడు ఇన్‌చార్జ్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత అనారోగ్యంపై గత నెల 30వ తేదీన అనేక వదంతులు వ్యాపించడంతో ఈనెల 1వ తేదీ రాత్రి విద్యాసాగర్‌రావు హుటాహుటిన ముంబయి నుంచి చెన్నై చేరుకుని నేరుగా అపోలోకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శనివారం ఉదయం 11.30 గంటలకు రెండోసారి ఆయన ఆస్పత్రికి వచ్చారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు పన్నీర్ సెల్వం, తంగమణి, వేలుమణి, డాక్టర్ విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామమోహన్‌రావు, ప్రభుత్వ గౌరవ సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తదితరులతో మాట్లాడి సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మంత్రుల బృందం గవర్నర్‌ను సీఎంకు చికిత్స సాగుతున్న రెండో అంతస్తులోని వార్డుకు తీసుకె ళ్లింది. అయితే జయ ఉన్న గదిలోకి గవర్నర్ వెళ్లలేదు. అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి.. సీఎంకు అందిస్తున్న చికిత్స గురించి గవర్నర్‌కు వివరించారు. జయలలిత బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. అర గంటపాటు ఆస్పత్రిలో గడిపిన గవర్నర్ 12 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం వైద్యుల బృందం కృషిని అభినందిస్తూ రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.జయలలిత పూర్తిగా కోలుకోవాలని మంత్రులు, అన్నాడీఎంకే కార్యకర్తలు శనివారం కూడా ప్రత్యేక పూజలు జరిపారు. ఎంపీ విజయకుమార్.. చెన్నై రాణీమేరి కళాశాలలో 1500 మంది విద్యార్థినులతో కలిసి ప్రార్థనలు చేశారు.