సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెడుతూ దేశంలో సరఫరాలను పెంచేందుకు ఉల్లికి టన్నుకు 850 డాలర్ల కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ను గురువారం ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ధర కన్నా తక్కువగా ఉల్లి ఎగుమతులను అనుమతించరు. ఉల్లి ధరలు రోజురోజుకూ భారమవుతున్న క్రమంలో 2015 డిసెంబర్‌లో తొలగించిన ఎంఈపీ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ టన్నుకు 850 డాలర్ల ఎంఈపీపై ఉల్లి ఎగుమతులను అనుమతిస్తామని డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
లెటర్ ఆఫ్ క్రెడిట్‌పైనే అన్ని రకాల ఉల్లి ఎగుమతులను అనుమతిస్తారని పేర్కొంది. ఉల్లి ధరల పెరుగుదలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు ఎంఈపీ నిర్ధేశించాలని ఆర్థిక శాఖను కోరిన విషయం తెలిసిందే.
దేశీయ మార్కెట్‌లో ఉల్లి సరఫరాలు తగ్గడంతో రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధరలు కిలోకు రూ 50 నుంచి రూ 65 వరకూ పలుకుతున్నాయి. ఉల్లి ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం 2000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం ఎంఎంటీసీని ఆదేశించింది.మరోవైపు నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఏసీ ద్వారా పదివేల టన్నుల ఉల్లిని సేకరించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment