సమగ్ర మార్గదర్శకాలు కావాలి
వ్యక్తిగత సమాచార భద్రతపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు సమగ్ర విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగ కేసులను విడివిడిగా పరిశీలించాలన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తుల ప్రైవేటు సమాచార భద్రతకు, ఆ సమాచారాన్ని నిర్దేశిత ప్రయోజనం కోసమే వాడుకోవడానికి సమగ్ర మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది. గోప్యతను మానవ హక్కుగా గుర్తించిన 1948నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని గుర్తుచేసింది.
చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనం మంగళవారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అన్న కేసుపై విచారణ జరిపింది. సమాచారాన్ని చాలామంది వాడుకుంటున్నప్పుడు ఒక్కో కేసును విడిగా చూడలేమని, దీని కోసం సమగ్ర మార్గదర్శకాలు ఉండాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగానికి, చట్టానికి భాష్యం చెప్పగలదే కాని, గోపత్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించజాలదని అన్నారు.
అలా ప్రకటించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ‘మన రాజ్యాంగ మూలపురుషులు రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో గోప్యత అంశాన్ని పరిశీలించి, దానిని ప్రాథమిక హక్కుల్లో చేర్చకూడదని నిర్ణయించారు. ఇప్పుడు ప్రాథమిక హక్కుగా పరిగణించాలని భావిస్తే పార్లమెంటు మాత్రమే ఆ పని చేయగలదు’ అని అన్నారు.. కోర్టు జోక్యం చేసుకుని, రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో గోప్యత అంశాలన్నీ చర్చించారని చెప్పలేమని పేర్కొంది. ప్రైవసీకి సంబంధించిన కొన్ని అంశాలు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడిన 21వ రాజ్యాంగ అధికరణంలో ఉన్నాయని సుందరం తెలిపారు. గోప్యత హక్కుకు చట్టం నుంచి రక్షణ ఉందని, దాని స్థాయిని ప్రాథమిక హక్కుకు పెంచాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ కేసులో నేడు కూడా వాదానలు కొనసాగనున్నాయి.
బ్రీత్ ఎనలైజర్లు 100 శాతం కచ్చితం కాదు
న్యూఢిల్లీ: బ్రీత్ ఎనలైజర్స్‌తో సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు 100శాతం కచ్చితమైనవి కావని ఢిల్లీలోని ఓ కోర్టు పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వివేక్ శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఓ మెజిస్ట్రీయల్ కోర్టు 2 రోజుల జైలుతో పాటు రూ.2వేలు ఫైన్ విధించింది. దీనిని సవాలు చేస్తూ అతను జిల్లా కోర్టును ఆశ్రయించాడు. బ్రీత్ ఎనలైజర్ ఫలితాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదని, ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఎంతో కొంత లోపం ఉంటుందని అదనపు సెషన్స్ జడ్జి లోకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. వివేక్ శరీరంలో ఆల్కహాల్ పరిమాణం 68.8ఎంజీ/100ఎంఎల్‌గా ఉందని, అధిక మొత్తంలో (300–500 ఎంజీ/100ఎంఎల్) సేవించే వారికి విధించే శిక్షను అతనికి వేయటం దారుణమన్నారు.