personal information security
-
parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చారన్న ఆరోపణల్ని మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతతో ప్రమేయమున్న ఈ బిల్లును హడావుడి ఆమోదించవద్దని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచి్చన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది. -
తెలుగులో గూగుల్ ‘సేఫ్టీ సెంటర్’ సేవలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారంపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘సేఫ్టీ సెంటర్’ పరిధిని విస్తరిస్తూ తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠి, ఉర్దూ భాషల్లో సేవలందించనుంది. తమ సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుకోవచ్చో వినియోగదారులు ప్రాథమ్యాల ప్రాతిపదికగా అనుమతిచ్చే వేదికగా సేఫ్టీసెంటర్ పనిచేస్తుంది. ‘గూగుల్ పౌరుల డేటాను అమ్ముకుంటోందన్న వాదనలు తప్పని సేఫ్టీ సెంటర్ల ద్వారా నిరూపించాం. గూగుల్ ఎందుకు, ఎలాంటి డేటాను సేకరిస్తోంది? డేటాను ఎలా వినియోగిస్తోంది? లాంటి విషయాల్ని వివరించాం. యూజర్ పేరు, పుట్టిన తేదీ, లొకేషన్, బ్రౌజింగ్ చరిత్ర తదితరాలను గూగుల్‌తో పంచుకోవడం ఇష్టం లేకపోతే అలాంటి సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు’ అని సంస్థ తెలిపింది. -
‘డేటా రక్షణ’ ముసాయిదా సిద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు నివేదికను అందజేసింది. డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు. -
పత్రికల్లో ఫేస్బుక్ క్షమాపణ ప్రకటనలు
లండన్: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవ్వడంపై ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, మార్క్ జుకర్‌బర్గ్ బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ప్రకటనల రూపంలో క్షమాపణలు కోరారు. ‘మీ సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అది చేయలేకపోతే ఈ స్థానానికి మేం అనర్హులం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా పనిచేసే ఓ వ్యక్తి ఫేస్బుక్ కోసం రూపొందించిన క్విజ్ యాప్‌తో డాటా దుర్వినియోగం అయ్యిందన్నారు. ‘ఇది నమ్మక ద్రోహమే. కానీ మేం ఇప్పుడు ఇంతకుమించి ఏం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అని అన్నారు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసేందుకు 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల డాటాను కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేయడం తెలిసిందే. యాప్‌లతో జాగ్రత్త న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలకు అనవసరంగా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే యాప్‌లతోనూ సమాచారం దుర్వినియోగం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్లలోని థర్డ్ పార్టీ అప్లికేషన్లు వాటికి అవసరం లేని సమాచారానికి యాక్సెస్ కోరుతున్నాయనీ, యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చే ముందు వినియోగదారులు ఆలోచించుకోవాలన్నారు. ‘ఉదాహరణకు ఓ గేమింగ్ యాప్‌కు ఫోన్లోని కాంటాక్టులు, మెసేజ్‌లతో పనుండదు. కానీ ఆ యాప్ వినియోగదారుల ఫోన్లో పనిచేయాలంటే మెసేజ్‌లు, కాంటాక్ట్లకూ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యాప్ సైబర్ నేరగాళ్లు అభివృద్ధి చేసిందయితే, లేదా ఆ యాప్ సర్వర్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవ్వొచ్చు’ అని నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సంస్థలో ఉన్నతాధికారి అల్తాఫ్ చెప్పారు. ఈ పర్మిషన్లు ఇస్తే బ్యాంకింగ్ లావాదేవీల సమయంలో ఫోన్లకు వచ్చే ఓటీపీలు వారికి తెలుస్తాయి. ఫోన్లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు, ఇతర సమస్త సమాచారానికి అనేక యాప్‌లు పర్మిషన్లు కోరుతుంటాయి. ఈ సమాచారం అంతా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సంస్థ కాస్పర్స్కీ ల్యాబ్ దక్షిణాసియా జీఎం భయానీ చెప్పారు. ఇలాంటి వాటిని నిరోధించాలంటే ప్రభుత్వం సైబర్ చట్టాలను కఠినతరం చేయడంతోపాటు యాప్‌లలోని తప్పులను ఎత్తిచూపితే వినియోగదారులకు రివార్డులు ఇచ్చే పథకాలను తేవాలన్నారు. -
సమగ్ర మార్గదర్శకాలు కావాలి
వ్యక్తిగత సమాచార భద్రతపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు సమగ్ర విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగ కేసులను విడివిడిగా పరిశీలించాలన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తుల ప్రైవేటు సమాచార భద్రతకు, ఆ సమాచారాన్ని నిర్దేశిత ప్రయోజనం కోసమే వాడుకోవడానికి సమగ్ర మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది. గోప్యతను మానవ హక్కుగా గుర్తించిన 1948నాటి ఐక్యరాజ్య సమితి ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని గుర్తుచేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనం మంగళవారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అన్న కేసుపై విచారణ జరిపింది. సమాచారాన్ని చాలామంది వాడుకుంటున్నప్పుడు ఒక్కో కేసును విడిగా చూడలేమని, దీని కోసం సమగ్ర మార్గదర్శకాలు ఉండాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగానికి, చట్టానికి భాష్యం చెప్పగలదే కాని, గోపత్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించజాలదని అన్నారు. అలా ప్రకటించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ‘మన రాజ్యాంగ మూలపురుషులు రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో గోప్యత అంశాన్ని పరిశీలించి, దానిని ప్రాథమిక హక్కుల్లో చేర్చకూడదని నిర్ణయించారు. ఇప్పుడు ప్రాథమిక హక్కుగా పరిగణించాలని భావిస్తే పార్లమెంటు మాత్రమే ఆ పని చేయగలదు’ అని అన్నారు.. కోర్టు జోక్యం చేసుకుని, రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో గోప్యత అంశాలన్నీ చర్చించారని చెప్పలేమని పేర్కొంది. ప్రైవసీకి సంబంధించిన కొన్ని అంశాలు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడిన 21వ రాజ్యాంగ అధికరణంలో ఉన్నాయని సుందరం తెలిపారు. గోప్యత హక్కుకు చట్టం నుంచి రక్షణ ఉందని, దాని స్థాయిని ప్రాథమిక హక్కుకు పెంచాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ కేసులో నేడు కూడా వాదానలు కొనసాగనున్నాయి. బ్రీత్ ఎనలైజర్లు 100 శాతం కచ్చితం కాదు న్యూఢిల్లీ: బ్రీత్ ఎనలైజర్స్‌తో సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు 100శాతం కచ్చితమైనవి కావని ఢిల్లీలోని ఓ కోర్టు పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వివేక్ శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఓ మెజిస్ట్రీయల్ కోర్టు 2 రోజుల జైలుతో పాటు రూ.2వేలు ఫైన్ విధించింది. దీనిని సవాలు చేస్తూ అతను జిల్లా కోర్టును ఆశ్రయించాడు. బ్రీత్ ఎనలైజర్ ఫలితాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదని, ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఎంతో కొంత లోపం ఉంటుందని అదనపు సెషన్స్ జడ్జి లోకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. వివేక్ శరీరంలో ఆల్కహాల్ పరిమాణం 68.8ఎంజీ/100ఎంఎల్‌గా ఉందని, అధిక మొత్తంలో (300–500 ఎంజీ/100ఎంఎల్) సేవించే వారికి విధించే శిక్షను అతనికి వేయటం దారుణమన్నారు.