న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు నివేదికను అందజేసింది.
డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment